ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా” సాధించేటంత వరకు నిర్విరామ ప్రయత్నాలు చేస్తామని గంభీర ప్రకటనలు చేసిన వైసీపీ అధినేత వ్యాఖ్యలు తుస్సుమన్నాయి. గుంటూరులో చేపట్టిన దీక్ష విరమించిన సమయంలో… “దీక్ష విరమించినా ప్రత్యేక హోదా పోరాటం మాత్రం ఆగదూ” అంటూ స్వయంగా జగన్ చేసిన ప్రకటనలు ఒట్టి మాటలేనని తేలిపోయాయి. అప్పటినుండి ఇప్పటివరకు “ప్రత్యేక హోదా” కోసం జగన్ చేపట్టిన కార్యక్రమలేవి లేవు. ప్రధాని నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వడం లేదంటూ ఓ ‘కుంటి సాకు’ చెప్పడం పరిపాటిగా మారిపోయింది.
ఓ రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న జగన్ కంటే, “ప్రత్యేక హోదా సాధన సమితి” పేరుతో ఉద్యమం చేస్తున్న చలసాని శ్రీనివాస్, కారెం శివాజీ వంటి వారు ఉత్తమమని నిరూపిస్తున్నారు. జగన్ మాదిరే వీరు కూడా గత కొంత కాలంగా మోడీ అప్పాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని సమయం ఇవ్వకపోయినప్పటికీ, పోరాటాన్ని ఆపకుండా, కేంద్ర మంత్రుల పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, వెంకయ్య నాయుడులను కలిసిన ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ బృందం, ఏపీకి స్పెషల్ స్టేటస్ ను కేటాయించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రులు ఎలా స్పందించినప్పటికీ, తమ వంతు భాగంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధాని అప్పాయింట్మెంట్ తో ‘కాలం’ వెల్లబుచ్చకుండా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర నేతలను కలిసి తమ విజ్ఞప్తులను అందజేస్తున్నారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు.
మరి జగన్ కూడా ఈ దిశగా కార్యాచరణ చేసి ప్రజల్లో గుర్తింపు పొందవచ్చు కదా అన్న ఆలోచన సామాన్యులకు కలగడం సహజమే! అదే జరిగితే తనపై ఉన్న కేసులేం కానూ..! అన్న భయం జగన్ కు కలగడం కూడా అంతే సహజం..!





