జగన్ జోస్యం… హాస్యాస్పదంగా లేదూ..!

YSRCP - a party of liquor barons!నేల మీద నడిచే వారి మాటలకు… ఊహల్లో తేలియాడుతూ గాల్లో మేడలు కట్టే వారి మాటలకు… ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రెండవ జాబితా క్రిందికే వస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన వారందరి లక్ష్యం ఒక్కటే… ఒక్కో స్థాయిని దాటుతూ అత్యున్నత పదవులను అధిరోహించాలని! ఒక వేళ దీనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వారు అబద్దాలు చెబుతున్నట్లే… లేదంటే మీడియా ప్రచారం కోసం రాజకీయాలు చేస్తున్నట్లే! వైకాపా అధినేత జగన్ కు ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. మార్గం ఏదైనా ఏపీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో విమర్శలకు తావు లేదు.

అయితే… ఎంచుకున్న లక్ష్యానికి… చేరుకోవాల్సిన గమ్యానికి… సరైన మార్గాన్ని అనుసరించాలి. బాట, మాట సరిగా ఉంటే గమ్యస్థానం ఆటోమేటిక్ గా చేరుకోవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే జగన్ ఫెయిల్ అవుతున్నారని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ‘జోతిష్యం’ పేరుతో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారాన్ని రేపి, ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎప్పుడైనా ఒకసారి వ్యాఖ్యానిస్తే, ప్రజలు కూడా కాస్త ఆలోచిస్తారు. కానీ, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శ చేయాల్సి వచ్చినా… జగన్ పలికే వ్యాఖ్యలు ఒక్కటే… ఈ ప్రభుత్వం పడిపోతుంది… నేను ముఖ్యమంత్రిని అవుతాను… మీ కష్టాలు తీరిపోతాయి..! రాజధాని భూసేకరణ నుండి కల్తీ మద్యం వరకు అన్నింటికీ ఇవే వ్యాఖ్యలు!

జగన్ మాటలు వింటుంటే… “జిందా తిలిస్మాత్ – సర్వ రోగ నివారిణి” అన్న హోర్డింగ్ గుర్తుకు రావడం సహజమే! జగన్ ప్రసంగాలను చూసి తలలు పట్టుకోవడం వైకాపా నేతల వంతవుతోంది. ‘ముఖ్యమంత్రిని అవుతాను’ అన్న జగన్ జోస్యం దేవుడెరుగు… కేసుల కుంభకోణంలో మళ్ళీ ఎప్పుడు జైలు పాలవుతారోనన్న ఒక ఆందోళన వైసీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. బహిరంగంగా ఎంత గంభీరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ లోలోపల “నాలుగు గోడల” భవిష్యత్తు జగన్ కు కూడా ఆందోళన కలిగించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వీటన్నిటి కంటే ముందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ పూర్తి బలంగా ఉంది. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘కాబోయే సిఎం’ నేనే అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories