చంద్రముఖి లకలకలు… అయ్యో పాపం!

Ys Jagan

బహిరంగ సభలు నిర్వహించడం ఎంత కష్టమో జనం కంటే రాజకీయ పార్టీలకే బాగా తెలుసు. సభ వేదిక, ఏర్పాట్లు, జనసమీకరణ, నిర్వహణ… ఇలా ప్రతీదీ చాలా భారీ ఖర్చు, శ్రమతో కూడుకున్నదే.

ముఖ్యమంత్రి సభ అంటే ఆ శ్రమ, ఖర్చు మరో పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి. అనేక మంది నేతలు, వందల మంది కార్యకర్తలు ఎంతో శ్రమిస్తేనే జనసమీకరణ చేయగలుగుతారు. అప్పుడే సభ విజయవంతం అవుతుంది.

ADVERTISEMENT

శనివారం ఏలూరు జిల్లా మల్కాపురంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన ‘సిద్దం సభ’ని విజయవంతం చేసేందుకు కూడా అనేకమంది కష్టపడ్డారు.

వైసీపి నేతలు ఏలూరులో ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటింపజేసి, స్కూలు బస్సులన్నిటినీ పట్టుకుపోయి వాటిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలను సభకు తరలించారు. వాలంటీర్లు సరేసరి. కష్టం అంతా వారిదే. సభకు రాకపోతే పధకాలు నిలిపివేస్తామంటూ బెదిరింపులు షరామామూలే!

జగన్‌ కొత్తగా నేర్చుకున్న పురాణ భాషలో ‘అక్షౌహిణి’ల జనం తన మీద ప్రేమాభిమానాలతో బిరబిరా పరుగులు తీస్తూ తన సభకు వచ్చేశారని గొప్పగా చెప్పుకున్నారు. సరే ఎలా తెస్తేనేమీ… సభలో వినేందుకు జనాలు ఉన్నారు!

కనుక జగన్‌ మళ్ళీ ఎప్పటిలాగే పాత పురాణం వల్లెవేస్తూ తాను కడిగిన ఆణిముత్యమని, తన అధికారాన్ని సవాలు చేస్తున్న టిడిపి, జనసేనలు, వాటికి మద్దతు ఇస్తున్న మీడియా అందరూ దుష్టశక్తులే అని చెప్పుకొచ్చారు.

వైసీపి నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు ఎంతో శ్రమపడి వేలాదిమందిని సభకు జనాలను ‘సిద్ధం’ చేసి తీసుకువస్తే, జగన్మోహన్‌ రెడ్డి మాత్రం మళ్ళీ పాత రోతపాటే పాడి ఓ చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నారు.

ఆయన తన ప్రభుత్వం, పాలన గురించి కంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, ఈనాడు, ఆంధ్రజ్యోతిల గురించే ఎక్కువ సేపు మాట్లాడారు.

విశేషమేమిటంటే ఈసారి జగన్‌ తన సభకు ‘చంద్రముఖి’ని కూడా వెంట తీసుకు వచ్చి ‘లకలక’మంటూ జనాలకు వినోదం పంచారు!

ఇదేదో మొదటిసారి అయితే ప్రజలు కూడా ఆయన చెప్పేది ఆసక్తిగా వినేవారు. కానీ 57 నెలలుగా జగన్‌ ఇదే పాట పాడుతుండటంతో జనాలు సభలో కూర్చోలేక, బయటకు పోలేక చాలా ఇబ్బంది పడ్డారు.

ఈ విషయం జగన్‌కు తెలుసో తెలీదో కానీ ఆయన ‘స్క్రిప్ట్ రైటర్స్‌’కు బాగా తెలుసు. అందుకే జగన్‌ ప్రసంగంలో కౌరవులు, పాండవులు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, కురుక్షేత్ర సంగ్రామం వంటి పురాణాలను, వాటిలో పాత్రలను చివరికి బాహుబలి, చంద్రముఖి, లకలకలను కూడా జొప్పిస్తుంటారు. అవన్నీ చదవడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ జనాలను సభలో కూర్చోబెట్టాలంటే తప్పదు! అటు తిప్పీ ఇటు తిప్పీ మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల గురించి మాట్లాడాలంటే జగన్‌ సభలో చంద్రముఖి, లకలకలు తప్పవు.

ADVERTISEMENT
Latest Stories