జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పక్క ఊరికి వెళ్ళాలన్నా హెలికాఫ్టర్‌లో వెళ్ళేవారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దావోస్ సదస్సుకి ప్రత్యేక విమానంలో వెళ్ళివచ్చారు. కానీ ఆ విమాన ఖర్చులకు సరిపడా పెట్టుబడులు తేలేకపోయారు.
ఇక ఢిల్లీకి వెళ్ళాలంటే ప్రత్యేక విమానం తప్పనిసరి. పోనీ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసం వెళ్ళివచ్చేవారా అంటే కానే కాదు. సంక్షేమ పధకాలకు అప్పుల కోసం, అక్రమస్తుల కేసులు, వివేకా హత్య కేసుల కోసమే ఢిల్లీకి వస్తుండేవారని ఓ బీజేపీ అగ్రనేత స్వయంగా చెప్పారు.
ప్రజల నుంచి చెత్తపన్ను వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల దుబారా సరిపోదన్నట్లు, ఋషికొండని చెక్కేసి రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకా హత్య కేసు, అక్రమాస్తుల కేసులలో వందల కోట్ల న్యాయవాదుల ఫీజులు ఏ పద్దు నుంచి చెల్లింపులు జరిగాయో ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఇవన్నీ ప్రజల సొమ్ముతో చేసిన జల్సాలు, విలాసాలు. కానీ ఇప్పుడు జగన్‌కి ప్రత్యేక విమానం కావాలనుకుంటే జేబులో నుంచి డబ్బు తీసి ఏర్పాటు చేసుకోవాలి లేదా వైసీపి నేతలెవరైనా ఆ ఖర్చులు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.
కానీ మరో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండక తప్పదని జగన్ స్వయంగా చెపుతున్నారు. కనుక ఇప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టిన్నట్లున్నారు. ఇటీవల జగన్ దంపతులు బెంగళూరుకి విమానంలో సాధారణ ప్రయాణికులతో కలిసి ఎకానమీ క్లాసులో ప్రయాణించారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఎప్పుడూ ప్రత్యేక విమానంలో తిరిగే జగన్ ఎకానమీ క్లాసులో ప్రయాణించడం విచిత్రంగానే ఉంటుంది కదా?విమానంలో బిజినెస్ క్లాసు కూడా ఉంటుంది. జగన్‌కు బిజినెస్ క్లాసు టికెట్ కొనుక్కోవచ్చు. కానీ వేలకోట్లో లక్షల కోట్లో ఆస్తులున్న జగన్ దంపతులు ఎకానమీ క్లాసులో ప్రయాణించడం విశేషం.
అంటే ప్రజాధనం అయితే ఎంతైనా ఖర్చు పెట్టగలరు కానీ సొంత డబ్బు అయితే పొదుపుగా ఖర్చు చేస్తారనుకోవాలేమో?
జగన్ దంపతులు ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానిపై రకరకాల కామెంట్స్ పడుతున్నాయి. వాటిలో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంది. “రేపు ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే, జగన్ తన అర్ధాంగిని వెంటబెట్టుకొని బస్సులోనే ప్రయాణిస్తారేమో? అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా అన్నారు.
ఆయన చెల్లెల్లు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి కడప వచ్చినప్పుడు సొంత డబ్బుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకొని వచ్చి పోతుంటారు. ఈ లెక్కన అన్న కంటే చెల్లెలే చాలా నయం అనిపిస్తుంది కదా?




