వైసీపీకి బయట శత్రువులు అవసరం లేదు!

YS Jagan Mohan Reddy and YSRCP politics

వైసీపీకి దాని రాజకీయ ప్రత్యర్థులు చేసే హాని కంటే స్వయంకృతాపరాధాలతో జరుగుతున్న నష్టమే ఎక్కువంటే వాళ్ళకు రోషం రావడం సహజమే.. కానీ వాస్తవాలు ఎన్నటికీ మారవు.

నాడు అమరావతే రాజధాని.. అందుకే తాడేపల్లిలో ప్యాలస్‌ అని వాదించిన నోటితోనే అది అమరావతి కాదు భ్రమరావతి, కమరావతి, శ్మశానం, వేశ్యల రాజధాని వంటి మాటలు మాట్లాడి మూల్యం చెల్లించుకుంది.

ADVERTISEMENT

అన్నా క్యాంటీన్లు మూసివేసి వాటిపైనే ఆధారపడిన లక్షలమంది నిరుపేదల ఆగ్రహానికి గురైంది. సువిశాలమైన భారత్‌కు ఒకే ఒక్క రాజధాని ఉండగా విభజన తర్వాత సగమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అంటూ వాదించి నవ్వులపాలైంది.

నాడు తాడేపల్లి ప్యాలస్‌ చూపించినట్లే తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు రుషికొండ ప్యాలస్‌ చూపిస్తూ విశాఖ రాజధాని అని నమ్మించబోయి మళ్ళీ ఎదురు దెబ్బ తింది.

మాజీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ఆరాటంలో టీడీపీతో జనసేనను జగన్‌ స్వయంగా కలిపారు. అందుకు భారీ మూల్యం చెల్లించారు.

పదవి, అధికారం కోల్పోయిన తర్వాత వాటి విలువ ఇప్పుడు అర్థమయ్యే ఉండాలి. కానీ ఇంకా కానట్లే ఉంది వైసీపీ తీరు.

ఓ పక్క చకచకా రాజధాని అమరావతి నిర్మాణ పనులు జరుగుతుంటే, సాక్షాత్తు పార్లమెంటు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేస్తే, జగన్‌ ‘మావిగన్‌’ అనడం పొరపాటే. ఈ ప్రతిపాదనతో నవ్వులపాలయ్యారు. రాజధాని విషయంలో నేటికీ స్థిరమైన అభిప్రాయం, మాట నిలకడ లేదని స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిందని నిరూపించేందుకు చేసిన హంగామా, ముఖ్యంగా ఎన్నికల సంఘం, విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చేసిన వ్యాఖ్యలు కూడా బెడిసికొట్టాయి. అందువల్లే ఈ ఎన్ల్సనికల్లో శాసనసభ ఎన్నికల కంటే దారుణంగా వైసీపీ ఓడిపోయింది.

తాజాగా వైఎస్ షర్మిల కూతురు పెళ్ళి విషయంలో జగన్‌ వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఆమెను యలహంక ప్యాలస్‌లో అడుగుపెట్టరాదని కోర్టు ఉత్తర్వులు జారీ చేయించడం వంటివి ఆయన నైజాన్ని చాటుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడి వాదనలు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బాగానే చేరాయి.

యలహంక ప్యాలస్‌పై వైఎస్ షర్మిలకు ఎటువంటి హక్కులు ఉండకపోవచ్చు. కానీ దానిలో ఆమె కూతురు పెళ్ళి చేసుకోనిచ్చి దానికి జగన్‌ దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఉండి ఉంటే ఆయన గౌరవమే ఇనుమడించేది కదా?

నష్ట నివారణకు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఈ సమయంలో సొంత మీడియాలో చెల్లి గురించి, చంద్రబాబు నాయుడుతో రాజకీయ సంబంధం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురిస్తుండటం రాజకీయ ఆత్మహత్యతో సమానమే కదా?

కనుక వైసీపీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ లేదా వైఎస్ షర్మిల శత్రువులు కానేకాదు. వైసీపీని ఒంటరిగా ఒంటిచేత్తో ఎన్నికల్లో గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డే, దానిని స్వయంగా ఓడించుకున్నారు. మిగిలిన ఈ మూడేళ్ళలో ఇలాంటివి మరిన్ని తప్పులు చేయడం తథ్యం. కనుక మళ్ళీ ఆయనే తన పార్టీని ఓడించుకుంటారని చెప్పక తప్పదు. ‘జగన్‌ 2.0’ కలను పగటికలగా మిగిల్చేయడానికి ఇలాంటి స్వయంకృతాపరాధాలు చాలు. బయట శత్రువులు అక్కర్లేదు.

ADVERTISEMENT
Latest Stories