నేను రాజకీయాలలో ఉన్నది జగన్‌ని తిట్టడానికి కాదు!

YS Sharmila

వైఎస్ షర్మిల జగనన్నతో విభేదించి తెలంగాణకు వెళ్ళి సొంత కుంపటి పెట్టుకున్నారు. కానీ చివరికి బూడిదే మిగిలింది. ఆమె చాలా అదృష్టవంతురాలు కనుక కాంగ్రెస్‌ అధిష్టానం పిలిచి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది.

ఆమె ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికలు జరిగాయి. వాటిలో ఆమెతో సహా కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా పోటీ చేసిన ఏ ఒక్కరు గెలవలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకు పోయినందున ఈ ఓటమికి ఆమెను తప్పు పట్టలేము.

ADVERTISEMENT

ఆమె పార్టీ పగ్గాలు చేపట్టి అప్పుడే 15 నెలలవుతోంది. కానీ ఇంతవరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలుకునేందుకు ఆమె చేసిందేమీ లేదు.

తల్లిని, చెల్లిని, పిల్లలకి ఆస్తులు ఇవ్వకుండా జగన్‌ కాజేశారని, వివేకా హత్యతో అన్నకి ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

ఆమె వైసీపీలోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్‌ నేతలను తిరిగి వెనక్కు రప్పిస్తారని, ఏపీలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించి బలోపేతం చేస్తారని, ఏపీలో జగన్‌ ఢీకొని నిలబడగల సత్తా కేవలం ఆమెకు మాత్రమే ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం భావించి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆమె అన్నని బలంగా ఢీకొంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం నేటికీ బ్రతికించలేకపోతున్నారు.

బహుశః ఈ విషయం ఆమె గ్రహించారో లేదో తెలీదు కానీ ఆమె ఓ మాట చెప్పారు. “నేను రాజకీయాలలో ఉన్నది జగన్‌ని తిట్టడానికి కాదు. పీసీసీ అధ్యక్షురాలిగా మా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది,” అని అన్నారు.

కానీ ఆమె ప్రజా సమస్యల కంటే అన్నతో ఆస్తుల పంచాయితీల గురించే ఎక్కువ మాట్లాడుతుంటారు. ఒకప్పుడు హేమాహేమీలతో నిండిన ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆమె తప్ప మరెవరి గొంతు వినపడదు. ఆమె వెంట సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కనపడరు.

ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆమెని నమ్మి ఏ ఒక్క వైసీపీ నేత కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. వచ్చేందుకు సాహసించడం లేదు.. అంటే అర్దం ఏమిటి?

కనుక ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తాను కనీసం పార్టీకైనా మేలు చేశానా లేదా?అని ఆలోచించుకుంటే మంచిది.

తెలంగాణ రాజకీయాలలో రాణించలేకపోవడం ఆమె తప్పు కాదు. కానీ ఏపీ రాజకీయాలలో రాణించలేకపోతే ఆమె భవిష్యత్‌, ఏపీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ ఏమవుతుంది? అని ఆమె ఇప్పుడే ఆలోచించుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories