ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు జనసేన రాజకీయ బలంపై కొత్త చర్చకు తెరలేపాయి. 2024 ఎన్నికల్లో, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటిన జనసేన.. పంచాయతీ పోరులో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తొలి విడతలో 3,949 పంచాయతీలకు గాను జనసేన మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 189 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి పవన్ తన పార్టీ క్యాడర్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కూటమి పొత్తుకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, బలం ఉన్న ప్రతి కార్యకర్త పోటీకి బరిలోకి దిగొచ్చని ప్రకటించారు.
కూటమి పొత్తులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన ఇప్పుడు అల్లూరి, మార్కాపురం, చిత్తూరు.. ఇలా దాదాపు ఆరు జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జనసేనకు రాజకీయంగా, సామాజికపరంగా మంచి పట్టున్న ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయింది.
అసలు జనసేన వెనుకబడటానికి కారణాలేమిటి? అనే చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది.
గ్రామస్థాయిలో జనసేన ఇప్పటికి సంస్థాగతంగా బలహీనంగానే ఉందా? టీడీపీ పార్టీతో పొత్తు లేకుంటే జనసేన క్షేత్రస్థాయి బలం ఇదేనా? పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలి అంటూ పవన్ పై రాజకీయ ఒత్తిడి తెచ్చే పార్టీ నాయకులు, క్యాడర్ ఇప్పుడు ఈ ఒంటరి పోరు ఫలితానికి బాధ్యత వహించగలరా?
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన పవన్ కు పార్టీ క్యాడర్ ఇచ్చిన బహుమతి ఇదేనా? ‘అడవితల్లి బాట’, ‘పల్లెపండుగ’ అంటూ వినూత్న కార్యక్రమాలు చేపట్టిన పవన్ తన పార్టీకి అవసరమైన సంస్థాగత రాజకీయ బలాన్ని సమకూర్చలేకపోతున్నారా?
అల్లూరి జిల్లా వంటి ప్రాంతాల్లో జనసేన కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం వెనుకున్న రాజకీయ తప్పిదాలేంటి? అసలు పార్టీ క్యాడర్, లీడర్లు పార్టీని క్షేత్రస్థాయిలో ఎందుకు బలపరచలేకపోతున్నారు? రాష్ట్రంలో ఎన్నికల తంతు మొదలవగానే ‘నీకెంత.. నాకెంత’ అంటూ పంచాయితీలు పెట్టుకునే నాయకులు, సోషల్ మీడియాలో యుద్దాలు చేసే కార్యకర్తలు నేటి ఫలితాలతో క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తున్నారా?




