ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక అధికార, ప్రతిపక్ష పార్టీలు శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ.
అధికార పార్టీలకు ఎలాగూ బిల్లుల ఆమోదం, అభివృద్ధి పనులపై చర్చలు వంటి నిర్దిష్టమైన అజెండా ఉంటుంది. వైసీపీ ప్రతిపక్ష పార్టీ కనుక అది కూడా బుధవారం తాడేపల్లి ప్యాలస్‌లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించుకోబోతున్నట్లు సమాచారం.
సాధారణంగా ఇలాంటి సమావేశాలలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అంశాల గురించి చర్చించుకోవడం పరిపాటి.
కానీ జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వనందుకు అనే సాకుతో రెండేళ్ళుగా శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్నప్పుడు, శాసనసభాపక్ష సమావేశం దేనికో అర్థం కాదు.
వైసీపీ అధినేత జగన్, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోయినా, ఎమ్మెల్సీలను మాత్రం మండలి సమావేశాలకు పంపిస్తున్నారు. కనుక వారితో వ్యూహాలు, అజెండా చర్చించడం కోసమే ఈ సమావేశమని సరిపెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన కీలకమైన బిల్లులపై శాసనసభలో జరిగే చర్చలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, మండలిలో ఎవరు ఎంత ఆవేశపడినా, పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ వైసీపీకి సొంత మీడియా ఉంది కనుక దానిలో ‘కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడించిన వైసీపీ ఎమ్మెల్సీలు’ వంటి హెడ్డింగ్స్ పెట్టుకొని కోరుకున్నట్లు వ్రాసుకోవచ్చు.




