ఎవరు కాదన్నా, లేకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాలలో అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ అరెస్ట్ వెనుక వైసీపీ కుట్ర ఉందని సర్వత్రా వెల్లువెత్తుతోన్న అభిప్రాయం. ఉన్నట్లుండి ఎందుకు బాబు అరెస్ట్ అయ్యారు? అంటే రాబోతున్న ఎన్నికలే ప్రధాన టార్గెట్ గా కనపడుతోంది.
గడిచిన రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. ప్రజల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావాలు ఏర్పడ్డాయన్నది కాదనలేని సత్యం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా, వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి కోటి కారణాలు ఉంటాయి.
నిజానికి ఇదే భావనలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారన్న టాక్ కూడా గత కొన్నాళ్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించిన మాటలు. టీడీపీలోకి చేరడానికి వైసీపీకి చెందిన వారు దాదాపుగా 40 మంది సిద్ధంగా ఉన్నారని ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు మీడియా వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది.
ఇప్పటికే కోటంరెడ్డి, మేకపాటి, యార్లగడ్డ వంటి వారు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వగా, ఈ జాబితా అంతకంతకూ పోయేలా కనిపించింది. బహుశా దీనిని అరికట్టడానికి, అలాగే భవిష్యత్తులో మరిన్ని చేరికలు లేకుండా ఉండడానికే వైసీపీ సర్కార్ చంద్రబాబును అరెస్ట్ చేయించిందన్న భావన పరోక్షంగా వైసీపీ మీడియా వర్గాలలోనే హల్చల్ చేస్తోంది.
వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్లకుండా ఆపడానికి మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా? అన్నది పక్కన పెడితే, నిజానికి ఇక్కడ ఓ విషయం స్పష్టమవుతోంది. తన పార్టీ నేతల మీద సీఎం జగన్ పట్టు కోల్పోయారన్న విషయం తేటతెల్లమవుతోంది. వైసీపీ నాయకులను నియంత్రించలేక టీడీపీ అధినేతను అరెస్ట్ చేయడం ఏ రాజ్యాంగపు రాజకీయాలో వారికే తెలియాలి.



