రేణిగుంట విమానాశ్రయ అధికారిపై దాడి జరిపిన కేసులో గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన వైకాపా ఎంపీ మిధున్ రెడ్డికి శ్రీకాళహస్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించారు. గట్టి బందోబస్తు మధ్య తెల్లవారుఝామున చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిధున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నేడు కోర్టులకు సెలవు కావడంతో, రేపు మాత్రమే బెయిల్ పిటిషన్ దాఖలుకు అవకాశముంది. అయితే ఈ అరెస్ట్ వెనుక పెద్ద “హైడ్రామా”నే సాగింది.
వైకాపా ఎంపీ మిధున్ రెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. రేణిగుంటలో ఎయిర్ ఇండియా మేనేజరుపై దాడి చేసిన కేసులో తాము ‘లుకౌట్’ నోటీసులను జారీ చేశామని తెలిపారు. వాటి కారణంగా చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించిన మిధున్ రెడ్డిని, అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆపై తిరుపతి పోలీసులకు అప్పగించారని వివరించారు. మిధున్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి సైతం విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
ఈ అరెస్ట్ ను ఉద్దేశించి అధికార పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత రాత్రి ఆయన్ను చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని ఈ ఉదయం న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, రిమాండ్ చేయడంపై వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విరుచుకుపడ్డారు. “ఓ ప్రజా ప్రతినిధిని ఇలా అరెస్ట్ చేయడంతో చంద్రబాబు పతనానికి నాంది పడిందని, ఏపీలో ప్రజాస్వామ్యం ఆనవాళ్లు కనిపించడం లేదని, ఇంత దుర్మార్గంగా ఓ ఎంపీని అరెస్ట్ చేయడం ఎక్కడా చూడలేదని మండిపడ్డారు.
మిధున్ రెడ్డిని పిలిస్తే, నేరుగా వచ్చి విచారణకు హాజరయ్యేవారని, రాజీ అయిన కేసులో అరెస్టులు అన్యాయమని, చిత్తూరు జిల్లాలో 250 చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ, వైకాపా ఎమ్మెల్యేలను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చర్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.





