శ్రీలంక విజయం… గర్వపడుతున్న జింబాబ్వే..!

Sri Lanka vs Zimbabweవన్డే సిరీస్ లో ఆతిధ్య జట్టును ఖంగు తినిపించిన జింబాబ్వే జట్టు, ఏకైక టెస్ట్ మ్యాచ్ లోనూ అదే దిశగా పయనించింది. అయితే చివరి రోజు శ్రీలంక బ్యాట్స్ మెన్లు చూపిన ప్రతిభతో చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక, నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి 173 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే అయిదవ రోజున ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోవడంతో, మ్యాచ్ పై జింబాబ్వే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

వన్డే సిరీస్ తో పాటు ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ లోనూ శ్రీలంక పరాజయం పాలు కావడం తధ్యమనుకున్న తరుణంలో… డిక్ వెల్ల 81 పరుగులు, గుణరత్నె అజేయమైన 80 పరుగులతో మ్యాచ్ ను లంకేయుల వైపుకు తిప్పారు. విజయానికి మరో 64 పరుగుల దూరంలో ఉన్న సమయంలో డిక్ వెల్ల పెవిలియన్ చేరుకోగా, తర్వాత క్రీజులోకి వచ్చిన పెరేరా 29 పరుగులతో గుణరత్నెకు చక్కని సహకారం అందించారు. దీంతో సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుని పరువు దక్కించుకుంది శ్రీలంక.

ADVERTISEMENT

ఈ విజయంతో ఆసియాలోనే అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా శ్రీలంక సరికొత్త చరిత్రను లిఖించింది. అలాగే ఆల్ టైం లక్ష్య చేధనలో టాప్ 5లో నిలిచింది. స్పిన్నర్లకు అనుకూలించే ఏషియన్ పిచ్ లపై అయిదవ మ్యాచ్ స్పిన్నర్లను ఎదుర్కొని ఇంత భారీ లక్ష్యం చేధించడం అయ్యే పని కాదు. కానీ శ్రీలంకకు ఓ ఎంపైర్ నిర్ణయం కూడా కలిసి రావడంతో విజయం సులభమైంది. అయితే ఓటమి పాలైన జింబాబ్వే మాత్రం గర్వపడే ప్రదర్శనను ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఒక విధంగా శ్రీలంక జట్టు మ్యాచ్ లో విజయాన్ని అందుకోగా, జింబాబ్వే జట్టు మనసు విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories