ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు మురుగదాస్, తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కించబోతున్నారు? తెలుగు హీరోతోనా? తమిళ హీరోతోనా? టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఆయా అగ్ర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ విషయంపై తాజాగా ఓ స్పష్టత వచ్చింది అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
‘తుపాకీ, కత్తి’ వంటి బ్లాక్ బస్టర్లు హిట్లు ఇచ్చిన తమిళ హీరో విజయ్ తో మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన మురుగదాస్, ప్రస్తుతం మహేష్ తో కూడా అలాంటి సినిమానే చేస్తుండగా, తదుపరి సినిమా విజయ్ తో కూడా మరో యాక్షన్ ఎంటర్టైనర్ వైపుకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
మురుగదాస్ సినిమాలకు తెలుగునాట మాంచి క్రేజ్ ఉండడంతో, విజయ్ చిత్రం మళ్ళీ ఏ రీమేక్ రూపంలోనో, డబ్బింగ్ రూపంలోనో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సెట్స్ పైనున్న మహేష్ సినిమా రిజల్ట్ పై ఈ క్రేజ్ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ – మురుగదాస్ ల కాంబోలో వచ్చిన “కత్తి” సినిమానే మెగాస్టార్ రీమేక్ చేసిందన్న విషయం తెలిసిందే.



