టిడిపి, జనసేనల పొత్తులలో భాగంగా తెనాలి శాసనసభ స్థానం జనసేనకు దక్కింది. అక్కడి నుంచి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు తెనాలి నియోజకవర్గంలో మంచి పట్టుంది. కనుక అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కానీ ఆ సీటు జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్‌కు దక్కడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. ఆయన అనుచరులు తీవ్ర ఆవేశంతో మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమయ్యారు.
కానీ ఆలపాటి రాజాని చంద్రబాబు నాయుడు బుజ్జగించిన తర్వాత ఆయన కూడా పరిస్థితిని అర్దం చేసుకున్నారు. నాదెండ్ల మనోహర్‌కు పూర్తి మద్దతు ఇచ్చి ఆయనని గెలిపించుకుంటామని చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చారు.
ఉండవల్లి నుంచి తెనాలి తిరిగిరాగానే ఆలపాటి రాజా తన అనుచరులతో అత్యవసరంగా సమావేశపరిచి వారికి కూడా పరిస్థితిని వివరించారు. ఇప్పుడు టికెట్ కోసం కొట్లాడే సమయం కాదని, టిడిపి, జనసేనల కూటమిని గెలిపించుకోవడమే చాలా ముఖ్యమని ఆలపాటి నొక్కి చెప్పారు.
తనకు టికెట్ దక్కనందుకు బాధపడుతున్న అనుచరులను సముదాయించి, అందరం కలిసి టిడిపి,జనసేనల ఉమ్మడి అభ్యర్ధి నాదెండ్ల మనోహర్‌ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, తద్వారా టిడిపి పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల తమకు ఎంత నమ్మకం, అభిమానం ఉన్నాయో నిరూపించి చూపుకుందామని ఆలపాటి రాజా చెప్పారు.
గత 15 ఏళ్ళుగా తన వెంట నడిచిన పార్టీ కార్యకర్తలందరూ ఈసారి జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్‌ని గెలిపించుకునేందుకు తనతో కలిసిరావలని ఆలపాటి రాజా విజ్ఞప్తి చేశారు. టిడిపిలో ఆలపాటి రాజా వంటి సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరిస్తే, ఆయన మొదట చాలా బాధ పడినప్పటికీ పరిస్థితి అర్దం చేసుకొని వెంటనే ఈవిదంగా స్పందిస్తున్నారు.
కానీ జనసేనకు 24 సీట్లని పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణం నుంచి జనసైనికులలో కొందరు వీరావేశంతో ఎంతగా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని వారి అధినేత పవన్ కళ్యాణ్ చెపుతుంటే, ‘మా జనసేన అభ్యర్ధులకు మాత్రమే మేము ఓట్లు వేసుకుంటాం,’ అని కొందరు సోషల్ మీడియాలో చెపుతుండటం, వారి అధినేత పట్ల గౌరవం లేదని సూచిస్తున్నట్లుంది.
అటువంటివారు టిడిపి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా చెపుతున్న ఈ మాటలు వింటే బాగుంటుంది.




