‘రంగస్థలం’ సినిమాతో మోత మ్రోగిస్తోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ సినిమాను వీడి ఆదివారం బోయపాటి శ్రీను సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సూపర్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు లభించిన రామ్ చరణ్ ను, ‘తమ్ముడు’ అంటూ పవర్ స్టార్ అభినందించిన విషయం తెలిసిందే. సక్సెస్ వేడుకలో చెర్రీ తనకు తమ్ముడి లాంటి వాడంటూ కితాబిచ్చి పవన్ గుండెలకు హత్తుకున్న వైనం మెగా మనస్సుల్లో నాటుకుపోయింది.
కట్ చేసి… నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ఈవెంట్ కు వస్తే… ఆలస్యం అయినా, పబ్లిక్ గా చెప్తున్నాను… నా తమ్ముడు రామ్ చరణ్ ‘రంగస్థలం’ ద్వారా అద్వితీయమైన విజయాన్ని అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ‘అందరికీ రామ్ చరణ్ తమ్ముడేనా’ అంటూ వాపోవడం మెగా ఫ్యాన్స్ వంతవుతోంది. పవన్ చెప్పిన దాంట్లో అర్ధం ఉంది గానీ, సమకాలీకులైన బన్నీ కూడా ‘తమ్ముడు’ అంటూ ప్రస్తావించడంలో ఉన్న ‘గూడార్ధం’ అర్ధం కాని పరిస్థితి.



