మన సంబరాల రాంబాబు అదే… మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శకులకు తన డాన్స్‌తోనే సమాధానం చెప్పారు.
‘పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పా?’ అని మొన్న సోషల్ మీడియాలో గట్టిగా నిలదీసిన ఆయన, నేడు భోగీ పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో పది మంది డాన్సర్లతో కలిసి గ్రూప్ డాన్స్ ఇరగదీశారు. తన డాన్స్‌తో రాష్ట్ర ప్రజలను అలరించారు.
ఎన్నికలలో ఓటమి అంబటిలో కళాకారుడిని చంపలేదని, లోపల కళాకారుడు సజీవంగానే ఉన్నాడని అంబటి మరోమారు నిరూపించారు. అలాగే రాంబాబు సంబరాలకు ఏ ఓటమి అడ్డుకాదని నిరూపించి చూపారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభుత్వం ఆయనలో వైసీపీ నాయకుడినే చూసింది తప్ప గొప్ప కళాకారుడుని చూడలేకపోయింది. కానీ అయనే పెద్ద మనసు చేసుకొని నేడు సత్తెనపల్లిలో సొంత ఖర్చుతో డాన్స్ చేశారు. తన కోసమా కానే కాదు. రాష్ట్ర ప్రజలను అలరించడం కోసమే!
మన టాలీవుడ్ అగ్ర హీరోల అదృష్టం కొద్దీ మన సంబరాల రాంబాబు సత్తెనపల్లి గడప దాటడం లేదు. ఒకవేళ ఆయన టాలీవుడ్‌లో అడుగుపెడితే చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూ.ఎన్టీర్ తదితర పెద్ద హీరోల పరిస్థితి ఏమిటి? అని ఆందోళన కలుగుతోంది.
ఇంతకాలం చిన్న సినిమాలు ఆడనీయకుండా పెద్ద సినిమాలు అడ్డుతగులుతున్నాయని వాదన వినిపిస్తుండేది. కానీ ఆ పెద్ద సినిమాలకు మన సంబరాల రాంబాబు ఇలా సవాలు విసురుతున్నారు. అయన నడిరోడ్డుపై ఇలా ఉచిత డాన్స్ ప్రదర్శనలు ఇస్తుంటే ఇక థియేటర్లకు ఎవరు వెళ్తారు? వెళ్ళకపోతే రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారి పరిస్థితి ఏమిటి?
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. #Sankranti pic.twitter.com/C5lsANxjXz
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2026




