మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “వైసీపి నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే మంత్రిగా ఉన్న నేను కూడా ఏమీ చేయలేక నిసహాయంగా చూస్తూ ఉండి పోవలసివచ్చింది. పోలీసుల ఎదుటే మా వాళ్ళపై దాడులు జరుగుతున్నా ఎవరూ అడ్డుకోవడం లేదు. నేను సీఐ, డీఎస్పీలకు ఫోన్లు చేసి పరిస్థితి వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ దాడులు పోలీస్ వ్యవస్థ వైఫల్యంగానే భావిస్తాను,” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఇంట్లో మొగుడుని చితకొట్టి రోడ్డుపైకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న భార్యలా ఉన్నాయి అంబటి రాంబాబు మాటలు. ఓ పక్క వైసీపి గూండాలు చెలరేగిపోయి టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా పలువురు వైసీపి నేతలను గృహనిర్బంధం చేయాల్సివచ్చింది.
కానీ మంత్రి అంబటి రాంబాబు తామే బాధితులమన్నట్లు తెలివిగా మాట్లాడుతున్నారు. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అంబటితో సహా పలువురికి ట్రీట్మెంట్ ఎలాగూ తప్పదు.
నేటికీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డితో సహ మంత్రులు పదవులలోనే ఉన్నారు. కనుక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. కానీ అదుపు తప్పాయని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందని అప్పుడే ఆరోపిస్తున్నారు కూడా. ఈ 5 ఏళ్ళు పోలీస్ వ్యవస్థని ఇష్టం వచ్చిన్నట్లు ఉపయోగించుకొని, ఇప్పుడు దిగిపోయే ముందు మంత్రి అంబటి రాంబాబు పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందని ‘కాండక్ట్ సర్టిఫికేట్’ ఇవ్వడం చాలా దారుణం.
పార్టీని వీడినవారి గురించి వైసీపి నేతలు ఎంత నీచంగా మాట్లాడుతారో అలాగే పోలీస్ శాఖ గురించి కూడా ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారనిపిస్తుంది.
పోలింగ్ తర్వాత రాష్ట్రంలో హటాత్తుగా చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల కమీషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరూ వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఇద్దరూ ఢిల్లీ బయలుదేరుతున్నారు. అధికారులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా పనిచేయకపోతే దానికి వారే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని చెప్పేందుకు ఇదే చక్కటి ఉదాహరణ.
జగన్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే ముందు కూడా ఇంత బరీ తెగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వారికి తెలియదనుకోలేము. అయినా బరి తెగిస్తున్నారంటే అన్నిటికీ సిద్దపడే చేస్తున్నారని అనుకోవాలేమో?




