గుంటూరులో లాస్ట్ బ్యాట్స్ మ్యాన్… అంబటి రాయుడు?

jagan-Ambati-Rayudu

టీమ్ ఇండియాలో మనవాడు ఉన్నాడని చెప్పుకోవడం ఎవరికైనా గర్వంగానే ఉంటుంది. అదే టీమ్‌లోంచి పక్కన పెడితే ‘అయ్యో పాపం’ అని బాధపడుతుంటాము కూడా. మనోడు అంబటి రాయుడు గురించి కూడా అందరం అలాగే సంతోషపడ్డాము… పక్కన పెట్టినప్పుడు అలాగే బాధపడ్డాము.

ఇప్పుడు మళ్ళీ మరోసారి అంబటి రాయుడిని చూసి అందరూ ‘అయ్యో పాపం’ అనుకోవలసివస్తోంది. ఎందుకంటే బౌండరీ లైన్ అవతల బంతిని క్యాచ్ పట్టి సంతోషపడిన ఆటగాడిలా, ఆయన పోయిపోయి వైసీపిలో చేరి సంతోషపడుతున్నందుకు!

ADVERTISEMENT

తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు రావడంతో నిన్న వెళ్ళి సిఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ఆయన వైసీపి కండువా కప్పి అంబటి రాయుడుని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలనే జగన్‌ పీకి పక్కనపడేస్తుంటే, ఇటువంటి సమయంలో అంబటి రాయుడు వెళ్ళి వైసీపిలో చేరడం చూస్తే ‘అయ్యో పాపం’ అనిపించక మానదు.

తాజా సమాచారం ప్రకారం అంబటి రాయుడుని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపి అభ్యర్ధిగా బరిలో దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, అంబటి రాయుడుని చూసి మరోసారి ‘అయ్యో పాపం’ అని జాలిపడక తప్పదు.

ఎందుకంటే, గుంటూరు జిల్లా టిడిపికి కంచుకోట వంటిది. గత ఎన్నికలలో గుంటూరు నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టిడిపి అభ్యర్ధి గల్లా జయదేవ్ చేతిలో ఒకటీ రెండూ కాదు… ఏకంగా 4,25,432 ఓట్ల తేడాతో ఓడిపోయారంటే వైసీపి పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

గల్లా జయదేవ్‌ని ఎదుర్కొని నిలబడటం కష్టం అని గ్రహించినందునే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నరసాపురం షిఫ్ట్ అయిపోవాలనుకొన్నారు. కనుక నరసాపురంలో రాయపాటి సాంబశివరావు వంటి సీనియర్ నాయకుడిని ఓడించిన లావు శ్రీకృష్ణ దేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్‌ ఒత్తిడి చేశారు. కానీ ఆయన అంగీకరించకపోవడంతో అంబటి రాయుడుని తెచ్చి నిలబెట్టబోతున్నారు!

రాజకీయాలలో కొమ్ములు తిరిగిన మోదుగుల, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరూ గల్లా జయదేవ్‌ని ఢీకొనలేక చేతులెత్తేస్తే, రాజకీయాలలో కొత్తగా అదీ… ఎన్నికలకు 4-5 నెలల ముందు వస్తున్న అంబటి రాయుడుని అక్కడ నుంచి పోటీ చేయించడం అంటే బలిపశువుని చేయడమే అని అర్దమవుతోంది. అందుకే అంబటి రాయుడుని చూసి మరోసారి ‘అయ్యో పాపం’ అని జాలి పడాల్సివస్తోంది.

మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్ మ్యాన్ అందరూ అవుట్ అయిపోయాక చివరిలో మొక్కుబడిగా బ్యాటింగ్‌కు వచ్చే ప్లేయర్స్‌ని చూసి అందరూ ఎలా నిట్టూర్పులు విడుస్తారో, అదేవిదంగా అంబటి రాయుడుని చూసి నిట్టూర్చక తప్పదు. అయితే అంబటి రాయుడు ఒక్క రన్ చేయకుండా అవుట్ అయినా ఈ మ్యాచ్‌లో ఆడిన రికార్డు, తృప్తి మిగులుతుంది. కనుక అందుకు ఆయన సంతోషపడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories