వైసీపీ నుంచి అనంత బాబు సస్పెండ్…కానీ కధ పూర్తవలేదు

anantha babu suspended from ysr congress partyడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును పార్టీ నుంచి స్పస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుదవారం సాయంత్రం ప్రకటించింది. అయితే కధ ఇక్కడితో ముగిసిపోలేదనే చెప్పాలి. ప్రస్తుతం కోనసీమ అల్లర్లపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నప్పటికీ ఆ కేసు వేరు, ఈ కేసు వేరని వేరే చెప్పక్కరలేదు.

అనంత బాబు కేసు గురించి మాట్లాడకుండా అందరూ కోనసీమ అల్లర్ల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారంటే హత్యానేరం కింద జైలులో ఉన్న అనంత బాబు కేసు గురించి మాట్లాడితే అది తమ పార్టీకి, ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. అదే…కోనసీమ అల్లర్ల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చని వైసీపీ నేతలు తహతహలాడుతున్నారు.

ADVERTISEMENT

అయితే కోనసీమ అల్లర్లలో ప్రతిపక్షాల హస్తం ఉందని ఆరోపిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మంత్రులు, తమ పార్టీ నేరస్తులను వెనకేసుకొని రాదని చెపుతున్నారు కనుక అనంత బాబు కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు పోలీసులపై ఒత్తిడి చేస్తే ప్రజలు హర్షించేవారు. కానీ అనంత బాబుని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నట్లుంది.

ప్రస్తుతం అతను 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అనంత బాబు హత్య చేయడం, అదీ…ఓ దళిత వ్యక్తిని హింసించి హత్య చేయడం, మళ్ళీ ఆ నేరాన్ని దాచిపుచ్చి రోడ్‌ యాక్సిడెంట్‌గా చిత్రీకరించి అందరినీ తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నించడం, హత్య చేసిన తరువాత పోలీసులకు లొంగిపోకుండా పారిపోవడం వంటి మరికొన్ని నేరాలకు కూడా పాల్పడినందున పోలీసులు వివిద సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి విచారణ జరపాల్సి ఉంటుంది.

ఈ నేరాలను కోర్టులో నిరూపించేందుకు పోలీసులు బలమైన, శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించి, అనంత బాబుకు చట్ట ప్రకారం కటిన శిక్ష పడేలా చేయాల్సి ఉంది. కనుక అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే ఓ పెద్ద శిక్షగా పరిగణించలేము.

ఇప్పుడు తదుపరి చర్యలు చేపట్టవలసిన బాధ్యత పోలీసులదే. అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిళ్ళు చేయకుండా వారి పనిని వారు స్వేచ్ఛగా చేసుకొనిస్తే అనంత బాబుకి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయగలరు. పోలీసులు కూడా తమ సమర్ధతను, నిష్పక్షపాత వైఖరిని నిరూపించుకొనేందుకు ఇదో అవకాశంగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఏపీ పోలీసులు ఏవిదంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories