నవ్యాంధ్ర ప్రజలకు అమరావతి రాజధాని అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మాత్రం దొనకొండ రాజధాని అని చెప్పవచ్చు. అందరూ అమరావతిని ముక్తకంఠంతో ఒప్పుకుంటే… కాదు కాదు దొనకొండ ప్రాంతంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, కేంద్ర కమిటీ కూడా దీనినే సూచించింది అంటూ జగన్ చేసిన వాదనలతో దొనకొండ ప్రాంతం వైపున రాజధాని నిర్మాణానికి జగన్ సుముఖంగా ఉన్నారన్న విషయం స్పష్టమైంది. దీనికి గల కారణమేమిటో రాజకీయ విజ్ఞులకు తెలిసిందే.
అయితే తాజాగా ఏపీ సిఎం చైనాలో పర్యటిస్తున్న సందర్భంగా దొనకొండలో ‘ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపుగా 43 వేల కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ తో కుదిరిన ఒప్పందం మేరకు మూడు దశల్లో ఈ పార్కు నిర్మాణం జరుగుతుందని, ఇది పూర్తయితే 55 వేల మందికి ఉపాధి లభ్యం కానుంది ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మొదటి దశలో 10,106.2 కోట్లు, రెండవ దశలో 12, 127.6 కోట్లు, మూడో దశలో 14,148.8 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు ఖరారయ్యాయి. తొలిదశ పూర్తయితేనే 10 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికారులు వివరించారు. వీటితో పాటు 10 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో కృష్ణపట్నం వద్ద ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. దీంతో మొత్తం రెండో రోజు చంద్రబాబు బృందం 54 వేల కోట్ల విలువైన పెట్టుబడులు నవ్యాంధ్రకు తరలి వచ్చేలా వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.



