రాష్ట్ర విభజన జరిగి సరిగ్గా పుష్కర కాలం గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికి ఒక గాడిన పడలేకపోతున్నాయి. నిత్యం ఏదొక వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
అయితే జగన్ రాజధాని ప్రకటనలు లేకుంటే వైసీపీ శ్రేణుల రప్ప రప్ప రాజకీయాలు, అవికాకుంటే సోషల్ మీడియా ముసుగులో ఏపీ ప్రభుత్వ పెద్దల టార్గెట్ గా సాగుతున్న హద్దులు దాటిన విమర్శలు, లేదా రాష్ట్రంలో వైసీపీ సృష్టిస్తున్న కుల విద్వేషాలు…ఇలా నిత్యం ఏపీ రాజకీయాలు ఆవిరి మీద ఉడుకున్న ఆహారపదార్ధాల మాదిరి కుతకుతలాడుతున్నాయి.
అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమయ్యింది…ఒక వైపు వైసీపీ అరాచకాలు మరోవైపు సోషల్ మీడియా ఉన్మాదాలు. ఈ రెండిటి కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బోనులోచిక్కిన ఎలక పిల్ల మాదిరి అల్లాడుతోంది. దీనితో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనుమరుగవుతుంది, ఇక జరగాల్సిన ప్రగతి పక్కదారి పడుతుంది.
అయితే ఈ వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటూ గగ్గోలు పెడుతున్నారు, ఇక సోషల్ మీడియా ఉన్మాదం పై ఉక్కు పాదం వెయ్యాలని చూస్తే అప్రజాస్వామ్య అంటూ, అన్యాయమంటూ, జస్ట్ ఆస్కింగ్ అంటూ, ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తుందంటూ లబోదిబో మంటు కుల రాజకీయాలు, మత వైషమ్యాలు, ప్రాంతీయ విద్వేషాలతో రెచ్చిపోతున్నారు, ప్రభుత్వాన్ని రెచ్చకొడుతున్నారు.
మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సోషల్ మీడియా అనే ‘పంజరం’లో బందీ అయ్యాయా సాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రత్యర్థుల ట్రాప్ లో కూటమి ప్రభుత్వం పడిందా.? లేదా ప్రభుత్వమే ప్రత్యర్థులను తన ట్రాప్ లోకి తెస్తుందా అన్న సంగతి సామాన్యుడికి అవగతం కావడం లేదు.
పొద్దున్న లేస్తే ఏపీ సోషల్ మీడియా తో పాటుగా తెలంగాణ సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ద్రుష్టి పెడుతూ ఒక వర్గం వారిని మెప్పించడానికి, వారి కళ్ళలో ఆనందం చూడడానికి ఏపీ రాజకీయాలను బజారుకు లాగుతున్నారు.
ఆంధ్రా నాయకులకు తెలంగాణ లో రాజకీయాలు చేయడానికి కూడా ఒప్పుకొని ఈ సోకాల్డ్ మేధావులు ఏపీ రాజకీయాల గురించి మాత్రం తెలంగాణలో విశ్లేషణలు, విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇదే మా రాజకీయ విమర్శ అంటూ సమర్ధించుకుంటున్నారు.
ఇటువంటి వారి ఉన్మాదాన్ని అణిచివేయకపోతే రేపటి రోజున సమాజం మొత్తం ఈ కలుషిత మనుషుల కబంద హస్తలలోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రా నేతలు తెలంగాణ రాజకీయ విశ్లేషకుల విమర్శల మీద కూడా స్పందించకూడదు అంటున్న వీరు, తెలంగాణ సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఏపీ ముఖ్యమంత్రి,, ఉపముఖ్యమంత్రి పై బూతు విమర్శలు చెయ్యొచ్చు, వారి వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా వేదికలెక్కించొచ్చు అంటూ వారి బూతు రాజకీయానికి భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మద్దతు పలుకుతున్నారు.
తెలంగాణ కేంద్రంగా ఏపీ ప్రభుత్వ పెద్దల మీద సాగుతున్న రాజకీయ, వ్యక్తిగత పైశాచికత్వానికి పాల్పడుతున్న ఆ సోషల్ మీడియా ఉన్మాదులంతా భారీ మూల్యం చెలించాల్సిందే అంటున్నారు సామాన్య ప్రజానీకం. గతంలో వైసీపీ కి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా సినీ దర్శకుడు ఆర్జీవీ ఇటువంటి ఉన్మాదాన్నే పెంచి పోషించారు.
దాని ఫలితం వైసీపీ ఓటమికి పునాది వేసింది. ఇక ఇప్పుడు ఆ స్థానంలోకి నటుడు ప్రకాష్ రాజ్ వచ్చి చేరారు. ఈయన గారి జస్ట్ ఆస్కింగ్ ఉన్మాదాన్ని దాటి ఉగ్రవాదంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఇటువంటి ఉన్మాదుల ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని, ఏపీ రాజకీయాలను ఈ సోషల్ మీడియా అనే పంజరం నుంచి బయటకు తేవాలని రాష్ట్ర శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.




