ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో జోనర్ కు స్పెషలిస్ట్ యాక్టర్స్, దర్శకులు ఉండేవారు. మనం ఫ్యామిలీ సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు వెంకటేష్, మాస్ యాక్షన్ అంటే చిరు, బాలకృష్ణ గుర్తుకొస్తారు. అలాగే దర్శకుల్లో చూస్కుంటే కమర్షియల్ అంటే వినాయక్-పూరి, యాక్షన్ అంటే బోయపాటి తలుపుకి రాగ, ఆ రూట్ లో అనిల్ రావిపూడి ఇప్పడు ఫ్యామిలీ కింగ్ గా ఉన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా జమానాలో, ఒక పాట లోని ట్యూన్ ను అనువుగా తీసుకుని మరో పాట వస్తేనే అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సినిమా – సినిమా కు మధ్య వ్యత్యాసం చూపకపోతే ఇండస్ట్రీలో నిలబడగలరా అనే ప్రశ్న కు, నమ్మిన పాయింట్ గట్టిదైతే జోనర్ ఒకటేనైనా అభిమానులు ఆశీర్వదిస్తారు అని రుజువు చేసి చూపారు ‘అనిల్ రావిపూడి’ మరియు ‘ప్రదీప్ రంగనాథన్’.
అనిల్ రావిపూడి కేవలం ఫ్యామిలీ లను టార్గెట్ చేసి సినిమాలు తియ్యరు! కానీ తన సినిమాను ప్రతి ఫ్యామిలీ చూడగలిగే రీతిలో తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తనకు తెలుసు అని ఎప్పటికప్పుడు నిరూపిస్తునే వస్తున్నారు.
పటాస్, సరిలేరు, భగవంత్, సుప్రీమ్ వంటి యాక్షన్ సినిమాల్లో కూడా కామెడీ మరియు సెంటిమెంట్ ను సరిగ్గా బ్లెండ్ చేసి బాక్స్-ఆఫీస్ దగ్గర బ్లాక్-బస్టర్ కొల్లగొట్టారు. ఇప్పటివరకు తెరకెక్కించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచకుండా, వరుసగా సంక్రాంతి విజయాలను అందుకుంటూ టాలీవుడ్ సంక్రాంతి స్టార్ దర్శకుడుగా ఎదిగారు అనిల్.
ఇక ఇప్పుడు కూడా తన పాత జోనర్ తోనే ఈ ఏడాది సంక్రాంతికి మెగా స్టార్ చిరు తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. గతేడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేసాడు అనిల్.
వెంకీ టైమింగ్ కు బుల్లిరాజు కామియో సినిమాను నిలబెట్టేసింది. ఇక, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇవాళ అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఈ సంక్రాంతి కూడా మనదే బాసు అనేలా హిట్ టాక్ ని సొంత చేసుకుంది.
ఇక ఇదే క్యాటగిరి లో పరిగణించగలిగిన మరొక ఇండస్ట్రీ స్టార్ ‘ప్రదీప్ రంగనాథన్’! ఈ తమిళ స్టార్ ‘లవ్ టుడే’ అంటూ అరంగేట్రం తోనే బ్లాక్-బస్టర్ అందుకున్నాడు. రెండవ సినిమా ‘డ్రాగన్’ కూడా అదే జోనర్ అవటంతో ఏ మాత్రం ఆకట్టుకుంటాడా అనే అభిమానుల ప్రశ్నలకు మరొక బ్లాక్-బస్టర్ తోనే బదులిచ్చాడు.
ఇక వరుసగా రెండు హిట్స్ వచ్చేపాటికి మూడవ సినిమా ఆరు నూరయినా ఆకట్టుకోలేదు అని అనుకున్నారంతా! కానీ, ‘డ్యూడ్’ తో వచ్చి హ్యాట్రిక్ బ్లాక్-బస్టర్ సొంతం చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. నటించిన మూడు సినిమాలు 3 బ్లాక్-బస్టర్లు అందుకుని మూడు కూడా100 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి.
‘లవ్ ఇంషురెన్స్ కంపెనీ’ అంటూ మరల అదే జోనర్ ను నమ్ముకున్నాడు ప్రదీప్. మరి ఇటు వైపు అనిల్ రావిపూడి ఫ్యామిలీ సైడ్ రాజమౌళి లా అవతరించాడు. ఇలా, ఈ ఇద్దరు స్టార్స్ జోనర్ మార్చకుండా అదే రూట్ లో వెళ్తున్నా, “ఈసారి దొరికేస్తాడు” అని అభిమానులు అనుకున్న ప్రతిసారి వారితోనే శభాష్ అనిపిస్తూ వస్తున్నారు. చూడాలి మరి ప్రదీప్ మరో సారి తను నమ్మకున్న జోనర్ తో బ్లాక్-బస్టర్ కొడతాడా..? లేదా దొరుకుతారా.?






