సుప్రీంకోర్టుదే ఆలస్యం.. ప్లాన్-బీ ఉందట!

AP BC Reservations

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయపార్టీలకు బీసీలు, మైనార్టీల మీద ఎంత ప్రేముందో కొలత వేసి చెప్పడం చాలా కష్టమే కానీ ఆ వర్గాలకు రిజర్వేషన్లు పేరుతో ఎప్పుడూ హడావుడి చేస్తూనే ఉంటాయి.

గతంలో కేసీఆర్‌ ముస్లింలకు రిజర్వేషన్లంటూ శాసనసభలో తీర్మానం చేసి దానిని పోస్టుబాక్సులో వేసి ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లంటూ హడావుడి చేశారు కానీ సుప్రీంకోర్టు ‘నో’ చెప్పడంతో వెనక్కు తగ్గారు.

ADVERTISEMENT

ఈ విషయం తెలిసి ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో జారీ చేస్తే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కానీ దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు.

కనుక రాష్ట్ర టీడీపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్లాన్-బీ గురించి చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా బీసీ రిజర్వేషన్లకు నో చెప్పేస్తే, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

ఈ మాట విన్నప్పుడు, బీసీ రిజర్వేషన్లు కోర్టులో నిలబడకపోవచ్చని తెలిసి ఉన్నప్పుడు, వైసీపీ చేత వేలెత్తి చూపించుకునే బదులు, కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకునే బదులు, ఇదే పని ముందే చేసి ఉండొచ్చుగా?అని అనిపించక మానదు.

సరే! బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్లాన్-బీ ఉంది కనుక ఇక ఈ అంశం గురించి చర్చ అనవసరం.

మరి కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్డుబాట్లో? అంటే వాటి గురించి మూడు పార్టీలు నాలుగు రౌండ్లు వేసి ఓ మాట అనుకున్నామని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ దాని అభ్యర్ధి పోటీ చేస్తారని, మిగిలిన రెండు పార్టీలు మద్దతు ఇస్తాయని చెప్పారు.

అయితే అది అంత వీజీ కాదని ఇప్పటికే జనసేన నేతల మాటలతో స్పష్టమైంది. ఈ సీట్ల కోసం టీడీపిలో అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి ఉంది. కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు.

బిజేపి కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. కనుక జనసేన వాయిస్ ఒక్కటే మైక్ పెట్టి వినిపించినట్లు కాస్త ఎక్కువగా వినిపించింది.

కనుక సుప్రీంకోర్టు కూడా బీసీ రిజర్వేషన్లపై కుండ బద్దలు కొట్టేశాక, మూడు పార్టీలు సిగపట్లు పట్టకుండా సీట్ల సర్దుబాట్లు చేసుకొని ఎన్నికలలో మెజార్టీ స్థానాలు దక్కించుకోగలిగితే చాలు.

వాటి ఐఖ్యత ఇలాంటి పరీక్షలు తట్టుకోగలదని, కలిసికట్టుగా పనిచేసి విజయం కూడా సాధించగలవనే చక్కటి సందేశం ప్రజలకు ఇవ్వగలుగుతాయి.

ADVERTISEMENT
Latest Stories