ఏపీలో సినీ పరిశ్రమకు పునాది: క్రియేటర్ ల్యాండ్

AP Partners with CreativeLand Asia

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేధింపులకు భయపడి తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి రమన్నా రాలేదు.

ఇప్పుడు జగన్‌ అధికారంలో లేరు. సినీ పరిశ్రమతో బలమైన సంబంధాలున్న సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌, నాగబాబు వంటివారు ప్రభుత్వంలో ఉన్నారు.

ADVERTISEMENT

అయినప్పటికీ సినీ పరిశ్రమ ఏపీకి తరలి వచ్చేందుకు, కనీసం ఏపీలో కూడా విస్తరించేందుకు ఆసక్తి చూపడం లేదు.. ఎందువల్ల అంటే జగన్‌ భయంతోనే!

ఒకవేళ వందలు, వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఏపీలో స్టూడియోలు వగైరా నిర్మించుకున్న తర్వాత మళ్ళీ జగన్‌ వస్తే?అడ్డంగా బుక్ అయిపోతామని సినీ పరిశ్రమలో వారు భయపడుతున్నారు.

కనుక ఏపీలో సినీ పరిశ్రమ విస్తరించడానికి జగనే పెద్ద అవరోధమని స్పష్టమవుతోంది. సినీ పరిశ్రమ ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం కూటమి ప్రభుత్వానికి, సినీ అభిమానులకు కూడా బాధ కలిగిస్తుంది. కానీ వారి బాధ కంటే సినీ పరిశ్రమకు కలిగే నష్టం భరించడమే చాలా కష్టం కనుక అర్ధం చేసుకొని సర్దుకుపోవలసిందే.

తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి రానప్పటికీ, ఏపీలో భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ ఏర్పాటు కాబోతోంది. దీని కోసం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.

క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకులు సాజాన్ రాజ్, హాలీవుడ్ నుంచి గ్లోబల్ అడ్వయిజరీ బోర్డు ప్రతినిధులు, ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈవో, ఇంటర్నేషనల్ గ్లోబల్ గేట్ మేనేజింగ్ డైరక్టర్, తదితరులు ఈ ఎంఓయూ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

దీనిలో ధీమ్ పార్కులు, గేమింగ్ జోన్స్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్స్, ఆర్‌ అండ్ డీ సెంటర్, సినీ పరిశ్రమకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలో (డిజిటల్) స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్, డిజిటల్ ఆవిష్కరణలు ఇంకా చాలా ఏర్పాటు అవుతాయి. కనుక దీనిని ‘క్రియేటర్ ల్యాండ్’ అని పేరు ఖరారు చేశారు. ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీని కోసం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా రాబోయే 5-6 ఏళ్ళలో రూ.8-10,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఆయా రంగాలలో ఉన్న సంస్థలు తమ స్టూడియోలు, థీమ్ పార్కులు వగైరా ఇక్కడ ఏర్పాటు చేయిస్తుంది. దీనిలో ఏర్పాటు కాబోయే సంస్థల ద్వారా సుమారు 1.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాది లభించవచ్చని అంచనా.

హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన అన్ని సదుపాయాలతో నిర్మిస్తే అది విజయవంతంగా నడుస్తోంది. ఇప్పుడు ఏపీలో క్రియేటర్ ల్యాండ్‌ పేరుతో ఓ చిన్న సిటీ ఏర్పాటు కాబోతోంది. కనుక దానిలో లభించే వీటన్నిటినీ సినీ పరిశ్రమ ఉపయోగించుకుంటుంది కనుక మెల్లగా ఏపీకి విస్తరించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories