2016 జనవరి 1వ తేదీ నుండి ఢిల్లీలో ఓ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు పెరిగిపోయిన కారుల వాడకాల రీత్యా, బేసి – సరి సంఖ్యల ఆధారంగా ప్రజలు కార్లను వినియోగించాలని కొత్త నిబంధనను అమలులోకి తీసుకురానుంది. దీనిపై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే 2000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది.
ఈ విధానంపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, కేజ్రీవాల్ కు అవాక్కయ్యే ప్రశ్నను విసిరింది. నిబంధన బాగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాల రీత్యా ఒక్కొక్కరు రెండు కార్లను కొంటే, అసలుకే మోసం వచ్చినట్లవుతుందని ప్రశ్నించింది. నిర్దేశించుకున్న లక్ష్యం అటుంచితే, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని గ్రీన్ ట్రైబ్యునల్ అభిప్రాయ పడింది. దీనిపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తే బాగుంటుందని కేజ్రీవాల్ కు సూచించింది. గ్రీన్ ట్రైబ్యునల్ లేవనెత్తిన ప్రశ్న ఢిల్లీ వాసులకు ఓ కొత్త ‘ఐడియా’ను ఇచ్చినట్లయ్యిందని, మరి దీనికి కేజ్రీ ఎలాంటి సమాధానం చెప్తారోనని రాజధాని వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





