ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టిన “బాహుబలి” సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఒకటి, రెండు దేశాలలో మినహా అందరూ పట్టం కట్టారు. ఆ క్రమంలోనే మరోసారి తన అదృష్టాన్ని బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకునేందుకు ‘బాహుబలి’ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను, విడుదల తేదీని హీరో రానా విడుదల చేసారు. చైనా భాషలో ఉన్న ‘బాహుబలి’ పేరు ఇండియాలో రాజుల కోటల మాదిరి ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా, గతంలో అమీర్ ఖాన్ “పీకే” ద్వారా నెలకొల్పిన రికార్డులను అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘పీకే’ మాదిరి రికార్డు స్థాయి సంఖ్యలోనే ఈ ‘బాహుబలి’ కూడా విడుదల అవుతుండడం మరియు దానికి తగిన విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేయడంతో… అక్కడ కూడా ‘జక్కన్న’ జెండా ఎగురుతుందని సినీ జనాలు భావిస్తున్నారు.



