పందెం కోళ్లు కాదు జోడెడ్లు…

Chandrababu Naidu Pawan Kalyan Alliance

రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు సహజమే, ఎత్తులు సహజమే. అలాగే పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్యాలు, నేతల మధ్య అహంభావాలు కూడా అంతే సహజం. అయితే ఇక్కడ ఒక్కరు ఎక్కువ అంటే మరొకరు తక్కువనేగా అంటూ రెచ్చిపోవడాలు, మేము ముందు అంటే నువ్వు వెనుక అంటూ రెచ్చకొట్టుకోవడాలు కూడా ఉంటాయి.

అలాగే ఒకరు పల్లకి ఎక్కితే మరొకరు పల్లకి మోస్తున్నారు అనే కవ్వింపు విమర్శలు వస్తాయి. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే రాజకీయ పార్టీల మధ్య ఏర్పడిన పొత్తులు ఆయా పార్టీల అధినేతల ఈగోలతో మూడునాళ్ళముచ్చటగా మారడం ఖాయం అనుకునే వారికి బాబు – పవన్ తమ స్నేహం తో పొత్తులో కనిపించని మరోకోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ADVERTISEMENT

టీడీపీ, జనసేన పొత్తు అనగానే ఇది ఆచరణ సాధ్యం కానిది, రాజకీయంగా ప్రజా క్షేత్రంలో నిలువలేనిది, ఈ రెండు పార్టీల సామాజికవర్గాలు పందెం కోళ్ళ మాదిరి కవ్వించుకునే వారే కానీ కలిసి ప్రయాణం చేస్తారా.? అంటూ బాబు, పవన్ ల కలయిక మీద ప్రత్యర్థి వైసీపీ నే కాదు టీడీపీ, జనసేన సొంత మద్దతుదారులు కూడా పెదవి విరిచారు.

అటువంటి పరిస్థితులలో ఒకటైన టీడీపీ, జనసేన 2024 ఎన్నికలలో కలిసి పోటీ చేసింది, ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయ చరిత్రలోనే 164 సీట్ల మెజారిటీతో గెలుపొంది ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీనితో బాబు – పవన్ ల జోడి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఇక అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతుంది, పదవుల పోరులో ఇరు పార్టీల మధ్య అసలైన రాజకీయం మొదలవుతుంది, ఈ కూటమి గెలుపు మూడునాళ్ళముచ్చటగానే ముగియబోతుంది అంటూ కలలు కన్న వైసీపీ కి ఆ కలలన్ని పగటికలలే అని నిరూపిస్తూనే వస్తున్నారు బాబు, పవన్.

ఏపీ ముఖ్యమంత్రిగా బాబు, ఉప ముఖ్యమంత్రి గా పవన్, చంద్రబాబు అనే నేను, పవన్ కళ్యాణ్ అనే నేను…అంటూ మొదలు పెట్టిన కూటమి పాలన “మనము” అంటూ కలిసి నడుస్తుంది, నడిపిస్తున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవానికి పవన్ తలవంచితే, నాలుగేళ్ళ అలుపెరుగని పోరాటాలకు బాబు తొలి ప్రాధాన్యమిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో తనకు దక్కే ప్రాధాన్యం, గౌరవం అన్ని సమంగా పవన్ కి దక్కాలని బాబు తాపత్రయ పడుతుంటే, మరో పదేళ్లు బాబు పాలనలో రాష్ట్రం ముందుకెళ్లాలని, అందుకు తనవంతు సహకారం, మద్దతు ఉంటుందంటూ పవన్ తపనపడుతున్నారు.

ఇలా ఈ ఇద్దరి కలయిక ఈ రెండు పార్టీల రాజకీయ స్నేహం బరిలో దిగిన పందెం కోళ్లు మాదిరి నువ్వా – నేనా అంటూ కలపడకుండా, పంట చేలో దిగిన జోడెడ్ల బండి మాదిరి నువ్వు – నేను అంటూ కలిసి కదులుతుంది.

ADVERTISEMENT
Latest Stories