నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి” షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ హీరో వెంకటేష్ వంటి అగ్ర తారలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులతో పాటు పలువురు రాజకీయ, చలన చిత్ర రంగ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ డ్రస్ లో మెరిసిపోతూ వచ్చిన బాలయ్య, అందరినీ నవ్వుతూ పలకరించారు.
ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టగా, దాసరి నారాయణరావు ముహూర్తపు షాట్ కు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్విచ్చాన్ చేయగా, కెమెరాను విక్టరీ వెంకటేష్ ఆపరేట్ చేశారు. రాఘవేంధ్రరావు స్క్రిప్ట్ ను, సింగీతం శ్రీనివాసరావు క్లాప్ ను దర్శకుడు క్రిష్ కు అందించారు. వీటిని అందుకున్న క్రిష్ రాఘవేంధ్రరావు, సింగీతం తదితరుల కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అతిథులంతా చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లోగో ప్రచార చిత్రంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసిన మంచి టైటిల్ డిజైన్ లో“గౌతమీపుత్ర శాతకర్ణి” అద్భుతంగా ఉందన్న టాక్ సొంతం చేసుకుంది. ఎంత అంగరంగ వైభవంగా అయితే సినిమా ప్రారంభమైందో అంతే వైభవంగా పూర్తి చేసుకుని, ఘనవిజయం సాధించాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.



