తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతగా కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని దర్శకులైన వి.వి.వినాయక్, బోయపాటి శ్రీనులను రంగంలోకి దింపడం అంటే సాధారణ విషయం కాదు. అలాగే మొదటి సినిమాలోనే అప్పటి టాప్ హీరోయిన్ సమంతతో ఆడిపాడిన శ్రీనివాస్, తాజాగా ఇప్పటి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి స్టెప్పులేసాడు.
చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాలను అందుకోవడంతో, ఈ సారి బోయపాటి శ్రీనును రంగంలోకి దించిన బెల్లంకొండ సురేష్, “జయ జానకి నాయక” ద్వారా తన తనయుడ్ని హీరోగా నిలబెట్టబోతున్నాడని ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ నమకాన్ని కలిగిస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, మాస్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసినట్లుగా కనపడుతోంది. చూడబోతుంటే… ఈ సినిమా ద్వారా బెల్లంకొండకు భారీ బ్రేక్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే ఉన్నదల్లా ఒక్కటే బ్యాడ్… ‘జయ జానకి నాయక’ సినిమా రిలీజ్ రోజునే, రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదల కానుండగా, నితిన్ ‘లై’ కూడా అదే రోజున పక్కాగా విడుదల కానుంది. ఈ ముగ్గురిలో ఎవరూ తగ్గేలా కనపడకపోవడంతో… బోయపాటి “జయ జానకి నాయక” సినిమానే ఒక రోజు ముందుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక రోజు ముందుగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చూస్తున్నారంటే, ఈ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులకు అంతులేని విశ్వాసం ఉన్నట్లుగా కనపడుతోంది.


