తొలి సినిమాతోనే సమంత, తమన్నా వంటి అగ్ర హీరోయిన్ల తో జత కట్టి సంచలనం సృష్టించిన బెల్లంకొండ సురేశ్ తనయుడు శ్రీనివాస్ త్వరలో బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా “నాన్నకు ప్రేమతో” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అల్లు అర్జున్ తో మరో చిత్రం సెట్స్ పైనుంది. అలా టాప్ హీరోలతో జత కడుతున్న రకుల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించడానికి “భారీ” ఆఫర్ ముందు పెట్టారట. అయినా కూడా ఈ సినిమాలో నటించడానికి సంశయిస్తోందని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రస్తుతం వస్తున్న చిత్రాలన్నీ అగ్ర హీరోలవే కావడంతో… ఈ తరుణంలో శ్రీనివాస్ వంటి ఒక హీరో సరసన నటిస్తే తన కెరీర్ కు నష్టం వాటిల్లుతుందేమోనని భావిస్తోందట. అలాగే ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కూడా సన్నగిల్లుతుందేమోనని భయపడుతోందట. రకుల్ నుండి ఆశించిన సమాధానం రాకపోవడంతో మరో ఆప్షన్ గా శృతిహాసన్ తో కూడా సంప్రదింపులు జరుపుతోందట చిత్ర యూనిట్. “శ్రీమంతుడు” ద్వారా భారీ హిట్ అందుకున్న శృతి ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లలో సందడి చేస్తోంది. మరి బెల్లంకొండ ఇచ్చే భారీ ఆఫర్ ను సొంతం చేసుకుని, బుట్టలో పడే టాప్ హీరోయిన్ ఎవరన్నది ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.





