జైల్లో దందాలు సాగిస్తున్న పరిటాల రవి ప్రత్యర్ధి?

BHANU-KIRAN oprates from jailదివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్రకు ఫ్యాక్షన్ ప్రత్యర్థిగా కొనసాగిన మద్దెలచెరువు సూరికి అనుచరుడిగా మసలిన వ్యక్తి భాను కిరణ్ గుర్తున్నాడా? అయితే సినీ ఫక్కీలో మాదిరి… తన గురువునే పట్టపగలు హైదరాబాద్ లో హత్య చేసిన కార్యానికి ప్రస్తుతం ఈ అనంతపురం వాసి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా గానీ, తన దందా స్టైల్ మార్చని భాను కిరణ్ లేటెస్ట్ గా ‘బురిడీ బాబా’ అవతారం దాల్చినట్లుగా తెలుస్తోంది.

సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను నిండా ముంచేసి దాదాపు 150 కోట్లు కొల్లగొట్టిన భాను కిరణ్ మోసగించిన వైనాన్ని తెలుసుకుని తెలంగాణ పోలీసులే నోరెళ్ల బెట్టారట. వివరాల్లోకి వెళితే… సాధారణంగా వర్షాకాలంలో పడే పిడుగులు అత్యంత శక్తిమంతమైనవి. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని భాను కిరణ్ జైల్లో ఉంటూనే 18 మంది సభ్యులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.

ADVERTISEMENT

బెంగళూరు కేంద్రంగా ‘కోహ్లీ గ్యాంగ్’ పేరిట రంగంలోకి దిగిన ఈ నయా ముఠా… ‘బిజినెస్ మెన్’ సినిమా తరహాలో ఓ కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా తెరిచింది. పిడుగు పాటు సమయంలో ఆకాశం నుంచి పడే శక్తిని ఒడిసిపడితే కోట్లాది రూపాయల ఖరీదు చేసే యురేనియం చేజిక్కినట్లేనని ఆ గ్యాంగ్ ప్రచారం ప్రారంభించింది. ఈ ముఠా మాయ మాటలకు తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు కూడా ఆకర్షితులయ్యారు.

పిడుగుల్లోని శక్తిని యురేనియంగా మార్చేందుకు ప్రయోగాలు చేయాలంటూ ఆ ముఠా పలికిన మాటలను సినీ, పారిశ్రామిక ప్రముఖులు గుడ్డిగా నమ్మేశారు. ప్రయోగాలకంటూ ఆ ముఠా అడిగిందే తడవుగా ముందూ వెనుకా చూడకుండా కోట్ల కొలదీ నిధులను అందజేశారు. అయితే ఆ తర్వాత ఆ ముఠా నుంచి మాట కూడా వినిపించకపోవడంతో తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా కార్యకలాపాలపై సమగ్ర సమాచారం సేకరించారు. ఆ తర్వాత బెంగళూరులో కూడా రోజుల తరబడి నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు ముఠా గుట్టును కనిపెట్టారు. వెనువెంటనే సదరు ముఠా ఏర్పాటు చేసుకున్న కార్పొరేట్ కార్యాలయంపై దాడి చేశారు. ముఠాలోని మొత్తం 18 మంది సభ్యులను అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా సదరు ముఠా సభ్యులు తమ నేత భాను కిరణ్ అని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. ఆ ముఠా చెప్పిన విషయాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే భాను కిరణ్ ను కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మీడియా వర్గాలతో పాటు, సినీ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ADVERTISEMENT
Latest Stories