కొందరు దర్శక నిర్మాతలు సినిమా పూజా కార్యక్రమం జరిగిన రోజునే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటించి ఆ ప్రకారమే విడుదల చేస్తుంటారు. అదేవిధంగా అధికారంలో ఉన్నవారు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఇంత కాలంలో పూర్తిచేస్తామని ప్రకటిస్తారు. అలా పూర్తిచేసినవారు కూడా ఉన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఏమన్నారంటే, “మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం,” అని.
అందువల్ల సిఎం చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని జగన్ తేల్చిపడేసి క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. మంచిదే. సంతోషమే.
కానీ చంద్రబాబు నాయుడు కూడా జగన్‌లాగే ఆలోచించి, ఇది పూర్తిచేస్తే జగన్‌కు పేరొస్తుందని పక్కన పెట్టేసి ఉంటే నేడు పూర్తయ్యేదా? విమానాలు ఎగిరేవా?
కానీ ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన నుంచి పుట్టినదే కనుక దీని అవసరం, ప్రాధాన్యత రెండూ ఆయనకు బాగా తెలుసు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకోవడం వల్లనే శరవేగంగా నిర్మాణ పనులు పూర్తిచేయించి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని మోడీ కూడా ఇదే చెప్పారుగా?
ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు దాని హయంలో పూర్తయితే వారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. తర్వాత వచ్చినవారు వాటిని పూర్తి చేస్తే వారికే దక్కుతుంది.
అయినా ప్రతీ పనికి డెబిట్, క్రెడిట్ అని లెక్కలు కట్టుకోవడానికి ఎవరైనా తమ సొంత డబ్బుతో పనులు చేయిస్తున్నారా? రుషికొండ ప్యాలస్‌లతో సహా అన్నీ ప్రజాధనంతోనే కదా?






