మహాగణపతిం మనసా స్మరామి…జై భోలో గణేష్ మహారాజ్

Grand Lord Ganesha idol during Vinayaka Chavithi celebrations in the Telugu states

రెండు తెలుగు రాష్ట్రాలలో వినాయకచవితి సందడి మొదలయ్యింది. అటు హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ‘మహా గణపతి’ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుండగా, ఇటు విజయవాడలో 72 అడుగులతో ‘శ్రీ పంచముఖ వరసిద్ధి మహాగణపతి’ రూపంలో మట్టి గణపతి భక్తులకు కన్నుల విందు చేస్తున్నాడు.

గణేష్ చతుర్థి అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇంటి మందిరంలో నుంచి వీధి మండపాల వరకు అందరు ఒకచోట చేరి జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ. ఈ పండుగ ద్వారా హిందూ సంప్రదాయాలు అంటే కేవలం ఆధ్యాత్మికతే కాదు ఇలా సమాజంలో ఉండే భిన్న రకాల మనసులను ఒక్కటిగా కలిపే ఒక వినూత్న కార్యక్రమంగా ను భావించవచ్చు.

ADVERTISEMENT

వినాయకుని ఆకారమే కాదు ఆయన మేధస్సు కూడా ఈ పండుగ ప్రత్యేకతను చాటుతుంది. తొలి పూజలందుకునేందుకు గణపతికి, కుమారస్వామి కి ఆ పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన పోటీ ద్వారా కేవలం భుజబలంతోనే కాదు బుద్దిబలంతోను విజయాలను సొంత చేసుకోవచ్చు అనే సందేశాన్ని ప్రపంచానికి అందించారు వినాయకుడు.

ఇక వినాయక చవితి స్పెషల్స్ లో చెప్పుకోదగ్గ మరో అంశం ఆయనకు నివేదించే ప్రసాదాలు…కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పరమాన్నం, పాలతాళికలు, పానకం, చలిమిడి వడ పప్పు, టెంకాయలు…ఇలా రకరకాల పిండి వంటలతో పాటుగా వివిధ రకాల పండ్లు, 21 రకాల పత్రాలతో వినాయకుడి పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి.

విద్యా, వ్యాపారం, వివాహం…ఇలా ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా తొలి పూజ మాత్రం ఆ గణపతికే దక్కుతుంది. తలపెట్టిన కార్యాలు ఎటువంటి విజ్ఞాలు లేకుండా సజావుగా సాగేందుకు, విజయాలు సాధించేందుకు దేవతల నుంచి సామాన్య ప్రజల వరకు జై భోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ అందరి చేత పూజలందుకుంటున్నారు బొజ్జ గణపతి.

అయితే వినాయకుని పూజలో ఆ గణపతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఆయన వాహనం అయినా చిట్టెలుకకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అకారణంగా ఇతరులను హేళన చేస్తే దేవతల రాజైన ఇంద్రుడికైనా శాపం తప్పదు అని, ఇచ్చిన శాపాన్ని పాటించకపోతే ఆ శ్రీకృషుడైనా నిందనల నుండి తప్పించుకోలేడనే సందేశం కూడా వినాయకుని కథలో చెప్పబడుతుంది.

ఇలా వినాయకచవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు భావితరాలకు ఒక్క చక్కటి సందేశ మార్గం అని కూడా చెప్పొచ్చు. అయితే నేడు దేశ వ్యాప్తంగా మొదలైన శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు M9 తరుపున వినాయకచవితి శుభాకాంక్షలు…జై భోలో గణేష్ మహారాజ్ కి జై.

ADVERTISEMENT
Latest Stories