బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఏం సాధించలేదని మండిపడ్డారు. అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రాజా సింగ్ కు లేఖ రాశారు.
అంతేకాదు, బీజేపీలో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించారు. ‘పార్టీకి ప్రాణం ఇచ్చేవారికి అధ్యక్ష పదవి ఇవ్వండి.. కిషన్‌రెడ్డి చేస్తున్న తప్పులు చాలా ఉన్నాయి. పార్టీ అభివృద్ధి కోసం.. ఎమ్మెల్యేలను కిషన్‌రెడ్డి పిలిచి ఎప్పుడైనా మాట్లాడారా’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. గ్రూపు రాజకీయాలను కిషన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, పార్టీని కాపాడుకోవడానికి క్రమశిక్షణ నోటీసులకైనా సిద్ధమన్నారు.
కిషన్ రెడ్డి ఉంటే పార్టీ అభివృద్ధి జరగదని, ఓయూలో జరిగే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని, గో సంరక్షణ మా విధి అని, కిషన్‌రెడ్డి బీఫ్ ఫెస్టివల్‌ను ఎలా సమర్ధిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. మొత్తానికి “బీఫ్ ఫెస్టివల్” తెలంగాణా బీజేపీని ఓ కుదుపు కుదుపుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.





