డీఎస్సీ-2025 నియామకాలకు సంబంధించి కొంతకాలంగా భిన్నమైన వాదనలు, వివిధ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు అభ్యర్థుల ఎంపికపై ప్రశ్నలు రావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది.
అయితే ఇలాంటి అంశాల్లో అసలు సమాధానం రాజకీయ ప్రకటనల్లోనూ, మీడియా కథనాల్లోనూ కాకుండా అధికారిక రికార్డుల్లోనే ఉంటుంది.
డీఎస్సీ-2025 మెరిట్ జాబితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియ మెరిట్, అర్హత, సంబంధిత నిబంధనల ఆధారంగా జరుగుతుందని డీఎస్సీ కన్వీనర్ అప్పట్లో స్పష్టం చేశారు.
ఇప్పుడు ఎవరి ఎంపికపై అయినా సందేహం ఉంటే, ఆ అభ్యర్థి ర్యాంకు, మెరిట్ స్థానం, అర్హత, రిజర్వేషన్ లేదా కోటా వివరాలు, నియామక ఉత్తర్వులను పరిశీలిస్తే సరిపోతుంది.
ఇటీవల రామకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన అంశంపై కూడా భిన్నమైన వివరాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన బ్యాక్ డోర్ ద్వారా డీఎస్సీ లో ప్రభుత్వ ఉద్యోగం సంపాధించారంటూ వార్తలు వెలుగులోకి రావడం, అందుకు ఆయన తన పై ఆరోపణలు చేసిన వారికీ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ సవాల్ విసరడం…ఇలా ఫేక్ ప్రచారమంటూ ఫాక్ట్ చెక్ లంటూ డీఎస్సీ మీద భిన్న కథనాలు ప్రచారమయ్యాయి.
అయితే అసలు ఈ ప్రచారాలను నమ్మే బదులుగా ఆయనకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిందా లేదా అన్నది కూడా అధికారిక రికార్డుల పరిశీలనతో స్పష్టం చేయవచ్చు. రామకృష్ణ వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు డీఎస్సీ లో మరో అక్రమ ఉద్యోగి అంటూ మరో వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే ఆ వివాదం పై పోలీసులకు ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ నమోదు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నందున, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సముచితం కాదు.
డీఎస్సీ వంటి వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామకాల్లో ప్రచారానికి మించి పారదర్శకత ముఖ్యం. ప్రభుత్వం అధికారిక రికార్డులను ముందుంచి ప్రతి సందేహానికి సమాధానం ఇవ్వగలిగితే, అనవసరమైన రాజకీయ వివాదాలకు కూడా తెరపడుతుంది.
ప్రశ్నలను స్వాగతించడం, రికార్డులతో సమాధానం ఇవ్వడం, నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం, ఇదే పారదర్శక పాలనకు సరైన మార్గం.





