తామూ అధికారంలోకి రాగానే ‘నల్ల కుభేరుల’ అంతు చూస్తామని, విదేశాల్లో దాగి వున్న ‘నల్లధనం’ను భారత్ కు తెచ్చి, దేశ ప్రయోజనాలకు వినియోగిస్తామని, మిగతా మొత్తాన్ని ప్రజలకు పంచి పెడతామని ప్రచార సభల్లో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఆ స్థాయిలో ‘బ్లాక్ మనీ’పై ఫోకస్ చేయలేదని ప్రతిపక్ష నాయకులతో పాటు రాజకీయ నిపుణులు కూడా స్పష్టం చేస్తూ… విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశా ఈ వ్యాఖ్యలను అధికార ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందో ఏమో గానీ, ‘బ్లాక్ మనీ’కి సంబంధించిన లెక్కలు బయటపెట్టింది.
2014 మార్చి నుండి 2015 నవంబర్ వరకు పలు దఫాలుగా నిర్వహించిన దాడులలో దాదాపు 16 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించినట్లు రెవిన్యూ కార్యదర్శి హస్ ముఖ్ అధియా తెలిపారు. అలాగే గుర్తించిన 16 వేల కోట్లలో ఇప్పటివరకు 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం స్వాధీన పరచుకుని, మొత్తం 774 కేసులను నమోదు చేసిందని వివరించారు. బ్లాక్ మనీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విండో ద్వారా 4,160 కోట్లు వచ్చాయని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధంగా ఉన్నారని సదరు రెవిన్యూ కార్యదర్శి చెప్పుకొచ్చారు.





