‘వచ్చింది కదా అవకాశం… ఓ మంచి మాట అనుకుందాం…’ అంటూ ఈ ఏడాది తొలి రోజున సినీ ప్రేక్షకులను పలకరించిన “బ్రహ్మోత్సవం” టీజర్ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పక్కా ‘ఎ’ క్లాస్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తదుపరి టీజర్ కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర కానుకగా తొలి టీజర్ విడుదల కాగా, తాజాగా తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ పర్వదినాన మరో టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. సర్వరుచుల సమ్మేళనం అయిన ‘ఉగాది’ పండుగ అయిన ఏప్రిల్ 8వ తేదీన “బ్రహ్మోత్సవం” రెండవ టీజర్ అభిమానుల ముందుకు రానుందన్న సమాచారం దాదాపుగా ఖరారైంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో కాజల్, సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 23వ తేదీన తిరుపతిలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుండగా, సినిమాను మే మొదటి లేక రెండవ వారంలో విడుదల చేయనున్నారు.



