మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం అనూహ్య మార్పులే వచ్చాయని చెప్పాలి. ముందు నుంచి వస్తున్న సర్వేల ఆధారంగా ఈసారి తెలంగాణలో ప్రభుత్వ మార్పు తప్పనిసరి అనేది తెలిసినప్పటికీ అది సాధ్యమా..? అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలే నిట్టూర్చారు.
అయితే అనుకున్న విధంగానే కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ ఆ పార్టీలో నేతలకన్నా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎక్కువ. వారిలో వారికీ సఖ్యత ఉండదు. అలాగే గెలిచినా వారి ఆనందం, కూడా ఎంతో కాలం నిలవదు అనుకున్న వారి ఆనందాలను ఏంతో కాలం కొనసాగనివ్వకుండా అడ్డుకట్ట వేశారు రేవంత్.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి పార్టీలోని అందరిని ఒక తాటి పైకి తెచ్చి ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇదే తరహా వ్యూహాలు అమలు చేసి కేసీఆర్ ని బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీయాలనే ఆలోచనలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్.
ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ నుండి వలస వస్తున్ననేతలను ఒడిసి పడుతున్నారు. ఇందులో భాగంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు రంగా రెడ్డి జెడ్పి చైర్ పర్సన్ అనితా రెడ్డి కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐసీసీ ఇంచార్జ్ మున్షి. అయితే హైద్రాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి కూడా నిన్న బిఆర్ఎస్ కారు దిగి హస్తం గూటికి చేరారు.
గతంలో కేసీఆర్ ఎలా అయితే పక్క పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించి ఆ పార్టీలను నామరూపాలు లేకుండా కనుమరుగు చేసారో అలాగే ఈ ఐదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలోని నేతలను ఒక్కక్కొరిగా పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ కు కూడా అదే దెబ్బ రుచి చూపించాలని కాంగ్రెస్ ఉవ్విర్లాడుతుంది. దీనిపై విమర్శించడానికి కూడా కనీస నైతిక హక్కు కోల్పోయింది బిఆర్ఎస్.
అంతకు తెగించి కేసీఆర్ కు ఒత్తాసుగా ఏ నాయకుడైన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ‘మిషన్ ఆకర్ష’ పై విమర్శలు చేస్తే ‘నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా’ అంటూ బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ‘పోటీలో నెగ్గడం అంటే చంపడం కాదు… ఓడించడం’ మాత్రమే అనే రాజకీయ విలువలు కేసీఆర్ పాటిస్తే ఇప్పుడు ప్రశ్నించే హక్కు కోల్పోయేవారు కాదుగా.




