అప్పుడు అరెస్ట్‌ చేసుకోమన్నారుగా.. ఇప్పుడు నిరసనలు దేనికి?

BRS Leaders Protest At Telangana Assembly Premises

తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న నల్లదుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలియజేస్తూ శాసనసభ సమావేశానికి వచ్చారు. లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్ళడాన్ని వారు అలా నిరసన తెలిపారు.

ADVERTISEMENT

కానీ అదేరోజు సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “మీరు బీడీలు వేసుకోనవసరం లేదు. నేడో రేపో మీకు (కేటీఆర్‌) ఎలాగూ పోలీసులు బేడీలు వేస్తారు,” అని వ్యంగ్యంగా అన్నారు. ఆయన ఆ మాట చెప్పిన 24 గంటలలోనే ఫార్ములా రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌-ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసి ఆయనకు నోటీస్ పంపింది. అదీ… నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన్నట్లు సమాచారం.

కనుక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతూ ఈరోజు శాసనసభకు వచ్చారు.

కేటీఆర్‌ని అరెస్ట్‌ చేస్తామని రేవంత్ రెడ్డి, మంత్రులు హెచ్చరిస్తున్నప్పుడు, “అరెస్ట్‌ చేస్తారా? చేసుకోండి.. నేను సిద్దంగా ఉన్నాను. అరెస్ట్‌ చేస్తే మహా అయితే ఏమవుతుంది? ఓ రెండు నెలలు జైల్లో ఉండాలి. అప్పుడు నేను అక్కడ యోగా వగైరా చేసుకొని ఫిట్‌గా తయారయ్యి బయటకు వస్తాను,” అని వ్యంగ్యంగా కేటీఆర్‌ అన్నారు.

కానీ ఇప్పుడు అరెస్టుకి రంగం సిద్దమైతే ‘అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తారా?’ అంటూ నినాదాలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

కానీ రాజకీయాలలో ఇది కూడా ఓ ‘ఫార్మాట్’ కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా దాని ప్రకారమే ముందుకు సాగుతోంది. కేటీఆర్‌ చెప్పిన్నట్లుగా ఆయన ఈ కేసులో అరెస్ట్‌ అయినా రెండు నెలల్లో కాదు.. కేవలం వారం పది రోజులలోనే బెయిల్‌పై బయటకు వచ్చేయగల సమర్ధులు. బయటకు వచ్చేసి ‘న్యాయం ధర్మం గెలిచ్చిందని’ చెప్పుకోకుండా ఉండరు.

బిఆర్ఎస్ పార్టీ చేసే హడావుడితో కేటీఆర్‌కి ప్రజలలో ‘సానుభూతి లెవెల్స్’ కూడా గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పైగా కొడుకుని అరెస్ట్‌ చేస్తే బోనులో సింహం బయటకు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది.

కనుక ఈ కేసుతో కేటీఆర్‌ని కొన్ని రోజులు లోపలవేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముచ్చట తీర్చుకోగలదేమో కానీ దానికి ఒరిగేది, అది చేయగలిగేదీ ఏమీ ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories