బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల అధినేతల పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇందుకుగాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్, వైసీపీ అధినేత వైస్ జగన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
చంద్రబాబు ఎన్నో సవాళ్ళను ఎదుర్కున్న నాయకుడని, లోకేష్ పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతున్న తీరు ప్రశంసనీయమని, జగన్ మంచి ఫైటర్ అని ఇలా ఈ ముగ్గురు విషయంలోనూ పాజిటివ్ సమాధానం చెప్పిన కవిత పవన్ విషయంలో మాత్రం జనసైనికుల ఆగ్రహానికి గురయ్యారు.
పవన్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన ఏపీ కి ఉప ముఖ్యమంత్రి అవ్వడం అనుకోకుండా జరిగిన ఒక సంఘటనగా భావించాలని, ఒక నిర్దిష్టమైన అభిప్రాయం అంటూ లేకుండా కమ్యూనిస్టుల మొదలుకుని బీజేపీ వరకు ఆయన అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని, ఇటువంటి వ్యక్తి మాటలను అంత సీరియస్ గా తెసుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత వ్యాఖ్యానించారు.
అయితే పవన్ పై కవిత చేసిన ఈ తరహా వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కవిత పై మండి పడుతున్నారు. కేసీఆర్ రాజకీయ వారసత్వంతో రాజకీయాలలోకి వచ్చిన మీరు ఒక మహిళా నేతగా ఉంటూ, ఢిల్లీ లిక్కర్ స్కాం లాంటి ఒక భారీ కుంభకోణంలో ఇరుక్కుని దాదాపు 6 మాసాలు జైలుకెళ్లోచ్చి ఇప్పుడు పవన్ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదం అంటున్నారు జనసైనికులు.
అలాగే ఈ తరహా ఆరోపణలు ఎదుర్కున్న తొలి తెలుగు రాజకీయ వేత్తగా రికార్డు సాధించిన కవిత, 100 % స్ట్రైక్ రేట్ తో ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని ఇంతలా అగౌరవపరచడం ఆమె అమాయకత్వమే అంటున్నారు.
అయితే తమ ప్రాణ మిత్రుడు, తెరచాటు రాజకీయ స్నేహితుడు అయిన వైస్ జగన్ ఓటమికి పరోక్ష కారకుడిగా మారిన పవన్ పట్ల కవిత ఈ రకమైన ద్వేషాన్ని వ్యక్తపరచడం ఆశ్చర్యం కాదులే అంటు కవిత అరెస్టైన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనసేన మద్దతుదారులు.




