విజయవాడను మరో అంశం కుదిపేస్తోంది. ‘కల్తీ మద్యం’ కనుమరుగు కాకుండానే ‘కాల్ మనీ’ అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారడంతో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అత్యవసరం కోసం డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించని పక్షంలో ఈ కాల్ మనీ వ్యాపారస్తులు చేసే ఆగడాల గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. సాధారణంగా అధిక వడ్డీల కోసం ఈ కాల్ మనీ వ్యాపారస్తులు కక్కుర్తి పడుతుంటారు. అయితే విజయవాడలో వెలుగు చూసిన ‘కాల్ మనీ’ వ్యవహారంలో మాత్రం ‘అంతకు మించి’ అనే విధంగా మహిళల పట్ల ప్రవర్తించారని తెలుస్తోంది.
డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేని పక్షంలో సెటిల్మెంట్ క్రింద ముందుగా, మహిళలను లైంగికంగా లోబరుచుకుని, దానికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి మరలా మరలా లైంగిక దాడులకు పాల్పడడం, అలాగే సదరు మహిళలకు సంబంధించిన కుటుంబీకులు (చెల్లి, అక్క, కూతురు, ఇతర బంధువుల)ను కూడా తీసుకురావాలని వేధించడం వంటివి చేస్తున్నారని వెలుగు చూసాయి. విజయవాడలో ‘కాల్ మనీ’ మాటున ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మహిళలు ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు.
ఇందులో ప్రధానంగా విజయవాడ టూటౌన్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నీలం నీలాంబరావు, వెనిగళ్ళ శ్రీకాంత్ తదితరులు ఉన్నారని బాధితులు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. కాల్ మనీ బాధితులు ఎక్కువగా టాస్క్ ఫోర్స్ ను సంప్రదిస్తున్నారని, అలాగే వాట్సప్ ద్వారా ఫిర్యాదులు అందజేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.
మహిళలను లైంగికంగా వేధిస్తుండగా, తోటి మగ వారి నుండి మాత్రం ఆస్తులను తమ పేర రిజిస్టర్ చేయించుకుంటున్నారని తేలింది. విజయవాడకు చెందిన సత్యంబాబు అనే వ్యక్తికి 11 లక్షల అప్పు ఇచ్చి, కోటి రూపాయల విలువైన సొంత ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఫిర్యాదుల జాబితా అంతకంతకూ పెరుగుతూపోతోంది.





