జాగృతికి అధినేత ఒకే, మరి నేతలు.?

Kavitha Telangana Jagruthi Party

బిఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ గా బయటకొచ్చిన కవిత, జాగృతి తో తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఇన్నాళ్ళుగా ఎక్కిన గులాబీ కారుని పక్కన పెట్టి తెలంగాణ రాజకీయాలలో స్వారీ చేయడానికి కవిత సింహం ఎక్కబోతున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే అవుననే అనిపిస్తుంది.

తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కవిత జాగృతి పార్టీ తరుపున సింహం గుర్తు పై బరిలోకి దిగనున్నారు అంటూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఇటు సోషల్ మీడియా వరకు విస్తృతంగా చర్చ జరుగుతుంది.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో అసలు కవిత జాగృతి పై చర్చ మొదలయ్యింది. జాగృతి అధినేతగా కవిత కనిపిస్తున్నారు కానీ ఆ పేరు మీద ఇప్పటి వరకు ఒక్క ప్రజా నాయకుడు కూడా కనిపించలేదు. ప్రజలకు కానీ మీడియా కు గాని సుపరిచితమైన నేత ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు కవిత జాగృతి కండువా కప్పుకోలేదు.

కవిత వెనుక జాగృతి పేరు మీద నడిచేవారంతా కూడా కవిత అనుచరులుగానో, జాగృతి వాలంటీర్లు గానో ఉన్నారు తప్ప అందులో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు మీడియా ముందుకొచ్చి తెలంగాణ రాజకీయాల పై ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు.

ఒక పార్టీ ఏర్పాటుకి అధినేత ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాయకులు కూడా అంతే కీలకం. అటువంటి ప్రజాబలమున్న నాయకులు కవిత వెనుక ఎవరు ఉన్నారు.? ఎప్పటికొస్తారు.? బీజేపీ వంటి జాతీయ పార్టీ సైతం రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వ బలం లేక పార్టీ ని ముందుకు తీసుకెళ్లలేకపోతుంది.

అలాగే బీజేపీ ని ప్రజలకు చేరువ చేయలేకపోతోంది. దాని ఫలితమే దశాబ్దాల బీజేపీ ఆశలు బ్యాలెట్ బాక్స్ లోనే శిధిలమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అధికార కాంగ్రెస్ కూడా ఇదే సమస్యతో రాష్ట్రం ఇచ్చిన పార్టీగా గుర్తింపు పొంది కూడా పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది.

అటువంటి జాతీయ పార్టీలను సైతం వెంటాడుతున్న నాయకుల లోపం, నాయకత్వ వైఫల్యం కవితను రాజకీయంగా గట్టెక్కిస్తుందా.? కవిత జాగృతి కి ఒకపక్క నాయకులు కొరత, మరోపక్క శత్రువుల బెడద దండిగా ఉన్న ఇటువంటి పరిస్థితులలో కవిత రాజకీయంగా వేసే తొలి అడుగు ఆమె రాజకీయ భవిష్యత్ కి అత్యంత కీలకం.

మరి ఆ అడుగు గెలుపు తో మొదలవుతుందా.? లేదా ఓటమిని పలకరిస్తుందా.? అలాగే తెలంగాణ రాజకీయాలలో కవిత జాగృతి మృగరాజు లా గర్జిస్తుందా.? లేదా బోనులో చిక్కిన సింహపు పిల్ల మాదిరి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories