సాధారణంగా సీబీఐ విచారణ జరిపి నేరస్తులను పట్టుకొని కోర్టులకు అప్పజెప్పి వారికి శిక్షలు పడేలా చేస్తుంది. కానీ ఇంతకు ముందు వివేకా హత్య కేసు విచారణ జరిపిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ కేసుల నుంచి విముక్తి కోసం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది.
Also Read – సనాతన ధర్మం: డీఎంకెకి అర్దమైంది… మరి మనకో?
ఆయన వివేకా హత్య కేసులో సాక్షులని బెదిరించి, భయపెట్టి వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెందుల పోలీసులు ఎదురు కేసు పెట్టడంతో ఆయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి రక్షణ పొందాల్సి వచ్చింది.
ఆయనతో పాటు వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై కూడా పులివెందుల పోలీసులు కేసులు పెట్టడంతో వారు కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా, వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నాలుగు వారాల వరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
Also Read – “వెటకారం..వెక్కిరింపులే” వైసీపీ డిక్లరేషనా.?
అంటే సీబీఐ అధికారులు ఏదైనా కేసులో ఎవరినైనా విచారణ చేస్తున్నప్పుడు, ఈవిదంగా సీబీఐ అధికారుల మీదే ఎదురు కేసులు వేసి తప్పించుకోవడమే కాకుండా వారినే కోర్టుల చుట్టూ తిప్పించవచ్చనే ఈ ఐడియా సరికొత్తదే. తద్వారా ఇకపై సీబీఐ అధికారులు ఎవరూ కూడా ధైర్యంగా, నిష్పక్షపాతంగా కేసులు విచారణ చేయలేని పరిస్థితి నెలకొంటుంది.
అలాగే ఈ కేసులో బాధితులు సునీతా రెడ్డి ఆమె భర్త కాగా వారిపైనే పోలీసుల చేత కేసులు నమోదు చేయించడం కూడా కొత్త ఐడియా అనే అనుకోవాలి. సునీతా రెడ్డి దంపతులు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటాలు చేయగల శక్తి సామర్ధ్యాలు గలవారు కనుక వారు ఇటువంటి కేసులతో కూడా పోరాడగలుగుతున్నారు.
Also Read – బిఆర్ఎస్ కు అస్త్రాలన్నీ కాంగ్రెసే ఇవ్వనుందా.?
అదే… సామాన్యులు అయితే ఈ కేసులకు భయపడి అన్యాయం జరిగినా మౌనంగా భరించి ఉండిపోక తప్పదన్న మాట!
ఇదీ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ విచారణ, కేసులు జరిగే తీరు. సాక్షాత్ సీబీఐ ఉన్నతాధికారులు, సిఎం చెల్లి సునీతా రెడ్డి పరిస్థితే ఈవిదంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?