ఏంటీ ఈ కర్మ… ఎన్నాళ్ళు అడుక్కోవాలి..!

chandrababu naidu narendra modi meet delhiప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు ‘స్వరం’లో మార్పు వచ్చింది. ఇప్పటివరకు వేచిచూసే ధోరణిలో మాట్లాడిన చంద్రబాబు తొలిసారిగా అసహనం, ఆక్రోశం, ఆవేదనలతో కూడిన మాటలతో ప్రసగించారు. ఈ వ్యాఖ్యలలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా, విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పై కూడా దండెత్తారు.

“ఒక మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అయిపోతుందా? విభజన సందర్భంగా ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదని, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదని దుయ్యబట్టిన చంద్రబాబు, ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి?’ అని ఆవేదన చెందారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని, తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘట్టాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు.

ADVERTISEMENT

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ సమాన స్థాయికి వచ్చే వరకు ‘స్పెషల్ స్టేటస్’ లేదా ‘స్పెషల్ ప్యాకేజీ’ ఇవ్వాలని, తామేమీ కేంద్రాన్నే అన్నీ చేయాలని అడగడం లేదని చెప్పారు. తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేసే బాధ్యత కేంద్రం మీద ఉందని పరోక్షంగా బిజెపి బాధ్యతలను గుర్తు చేసారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని, ప్రతి ఏటా 35 వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయామని, ఈశాన్య భారతంలో ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల మాదిరే, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఏపీ పరిస్థితి కూడా ఇలాగే తయారైందని పేర్కొన్నారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమ‌లైనా ఏపీకి లోటు బ‌డ్జెట్టు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని, తెలంగాణ‌కి 9 వేల కోట్ల‌ మిగులు బ‌డ్జెట్ ఉందని, కానీ ఏపీకి ఐదేళ్ల త‌రువాత కూడా 47 వేల కోట్ల లోటు బ‌డ్జెట్ ఉంటుందని, విభ‌జ‌న‌లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించడం వల్లే ఇలా జ‌రుగుతోంద‌ని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉందని, అందుకని ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత వాటిపై ఉందని తెలిపారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం సమస్యలకు పరిష్కారం ఏంటి? రెండు ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. దీనికి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ విధివిధానాలపై నిర్ణయం తీసుకుని, పరిష్కారం చూపాల్సిన కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు. వరదలు వస్తే ఏపీ నష్టపోయేలాగా, వరదలు రాకపోతే ఎగువ రాష్ట్రాలు లాభపడేలాగా నిర్ణయాలు తీసుకుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధానికి తెలిపానని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు అయినా సరే అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదని, ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రాజెక్టులు కట్టుకుంటే పాలసీలు ఎందుకని నిలదీశారు.

ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోదని ప్రధానికి వివరించానని, పార్లమెంటులో ఇచ్చిన హోదా హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశానని, న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రధాని, ఆర్థిక మంత్రిని కోరానని, వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories