
ఇది యాదృచ్చికమే కావచ్చు కానీ చాలా గమ్మత్తుగా ఉంది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే, ఇవాళ్ళ శాసనసభలో శాంతి భద్రతలపై సిఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు.
చంద్రబాబు నాయుడు నెలన్నర పాలనలో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఢిల్లీలో జగన్ దుష్ప్రచారం చేసి వస్తే, గత 5 ఏళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో ఏవిధంగా రాక్షస పాలన సాగింధి? ఎవరెవరి మీద దాడులు జరిగాయి. ఎన్ని కేసులు నమోదు చేశారు?ఏవిదంగా చిత్రహింసలు పెట్టారో సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో క్షుణ్ణంగా వివరించారు.
తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్‌పై 7 కేసులు, అత్యధికంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60 కేసులు నమోదు చేశారని చెప్పారు. సొంత ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కూడా కేసు నమోదు చేసి విచారణ పేరుతో అరికాళ్ళు వాచిపోయేలా కొట్టారని, ఆయనను చిత్రహింసలు పెడుతుంటే జగన్ ఆ వీడియోని లైవ్‌లో చూసి పైశాచిక ఆనందం అనుభవించారని అన్నారు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
జగన్ పోలీసులను వాడుకోవడమే కాదు వారితో కూడా ఆడుకున్నారని చెపుతూ, ఏబీ వేంకటేశ్వర రావుని ఏవిదంగా వేధించారో వివరించారు.
ప్రతిపక్షాలను, పోలీసులను, పార్టీ కార్యకర్తలని, పేద ప్రజలను, దళితులను సమాజంలో ఏ ఒక్కరినీ జగన్ విడిచిపెట్టలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కొందరు పోలీసుల కేసుల బాధితులు కాగా మరికొందరు వైసీపి నేతల భూకబ్జాలు, ఇసుక దందాల బాధితులని అన్నారు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
“మీలో కేసులు ఉన్నవారు నిలబడాలని” సిఎం చంద్రబాబు నాయుడు కోరగా శాసనసభలో దాదాపు 75శాతం మంది లేచి నిలబడ్డారు! జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలను ఎంతగా వేధించారో చెప్పడానికి ఇంత కంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?
తనను జైల్లోనే అంతం చేసేద్దామని జగన్ అనుకున్నారని కానీ అంత ధైర్యం చేయలేక జైల్లో పెట్టినందుకు పైశాచిక ఆనందం పొందారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
“ఇదివరకు రాయలసీమలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. కానీ మన ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వలన ఫ్యాక్షనిజం పోయి దాని స్థానంలో పరిశ్రమలు, అభివృద్ధి మొదలయ్యాయి. కానీ జగన్ వచ్చాక మళ్ళీ రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షనిజం విస్తరించింది. ఐదేళ్ళ పాటు రాష్ట్రంలో అరాచక పాలన చేసిన జగన్ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధర్నా చేయడం సిగ్గుచేటు” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలుపుతానని, అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అధికారులు కూడా అనుచితంగా వ్యవహరిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యంగా సామాజిక మద్యమాలలో మహిళలను కించపరుస్తూ ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కటిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఢిల్లీలో ధర్నా విజయవంతంగా ముగించుకొని జగన్ గురువారం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారని ఆయనకు వైసీపి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారని వైసీపి సొంత మీడియా వెల్లడించింది. అయితే ఢిల్లీలో ధర్నా చేసి జగన్ నవ్వుల పాలయ్యారు.
కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్దమన్నట్లు సంకేతాలు పంపడం ద్వారా మోడీని శత్రువుగా మార్చుకున్నట్లయింది. కనుక కేసీఆర్ లాగా మోడీ యుద్ధానికి జగన్ సిద్దమేనా? చేస్తే, చేయకపోతే తన పరిస్థితి ఏమిటి?అని జగన్ ఆలోచించుకుంటే మంచిదేమో?