ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని రాబట్టారు. దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు… పక్కా వ్యూహం రచించుకుని హస్తినలో కాలు పెట్టారు. “ప్రత్యేక హోదా” సహా 12 అంశాలపై 18 పేజీల నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసిన చంద్రబాబు… ముందుగా రచించుకున్న వ్యూహాన్ని అమలు చేసి నరేంద్ర మోడీని ‘సెల్ఫ్ డిఫెన్స్’లో పడేశారు.
వెరసి ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై చంద్రబాబు స్పష్టమైన హామీని పొంది బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా అంటూ ప్రధాని మోడీ ఎక్కడా ప్రస్తావించకున్నా, ఏపీకి అవసరమైన అన్నీ చేస్తామంటూ చంద్రబాబుకు భరోసా ఇవ్వక తప్పలేదు. ముందుకు మోడీ వెళ్లగానే తన వెంట తీసుకెళ్లిన 18 పేజీల వినతి పత్రాన్ని అందజేసిన చంద్రబాబు, ఆ తర్వాత వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు.
“ప్రత్యేక హోదా మా హక్కు. దానిని ఇవ్వాల్సిందే. నీతి ఆయోగ్ ఒప్పుకోలేదనో, ఆర్థిక సంఘం చెప్పలేదనో వదులుకోలేం. హోదా ఇవ్వకపోతే పార్లమెంటుపైనే ప్రజలకు విశ్వాసం పోతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్… ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు ఉభయులూ కలిసి ఏపీకి హోదా ఇస్తామని వాగ్దానం చేశారు, అన్ని పార్టీలూ ఆమోదించాయి. ఇంత జరిగిన తర్వాత వెనక్కు వెళ్లడం మీ ప్రతిష్ఠకు మంచిది కాదు.” అంటూ విభజన సందర్భంగా పార్లమెంట్ వేదికగా బిజెపి చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసినట్లుగా సమాచారం.
“ఏడాదికి 60 వేల కోట్లిచ్చే రాజధాని హైదరాబాద్ ను మేం కోల్పోయాం. దేశంలో ఇంత ఇబ్బందికర పరిస్థితిని ఏ రాష్ట్రం ఎదుర్కోలేదు. అందుకే హోదా అడుగుతున్నాం. త్వరగా ఇవ్వండి” అంటూ చంద్రబాబు ఒత్తిడి తెచ్చే విధంగా వ్యాఖ్యానించగా, సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీకి అవసరమైన అన్నీ చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.





