మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల హైదరాబాద్ పర్యటన అనంతరం అమరావతి తిరిగి వచ్చారు. ఈ నెల 7వ తారీఖున వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. సింగపూర్ గానీ అమెరికా గానీ వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఘోర పరాజయం తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంది సేద తీరాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. వచ్చిన తరువాత ఆయనకు ఐదు సంవత్సరాల కఠిన పరీక్షలు ఎలాగూ తప్పవు.
మరోవైపు ఆయన విదేశీ పర్యటన నుండి రాగానే పంచాయతీ ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు కావాల్సిన సమాచారం, కుల గణనను పూర్తి చేశారు. ప్రభుత్వం ఓకే అంటే ఎన్నికలు జరిగేందుకు సిద్ధం. ఈ ఎన్నికలకు టీడీపీ ఆదాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంది. చంద్రబాబు రాగానే తగిన అభ్యర్థుల కోసం అంతర్గత కసరత్తు ప్రారంభిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల వ్యయం తడిసి మోపెడైంది.
మళ్లీ రెండు, మూడు నెలలు గడవక మునుపే స్థానిక ఎన్నికలు వస్తే అధికార పక్షానికి పర్వాలేదు గానీ ప్రతిపక్షానికి అది ఇబ్బందే పోని కిందిస్థాయి నేతలైనా పెట్టుబడి పెడతారా ? అంటే ఇప్పటి వరకు అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఆర్థిక పుష్టి కలిగిన అభ్యర్థులనే రంగంలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వీటికి అన్నిటికీ సిద్ధం కావాల్సి ఉంది. టీడీపీ భవిష్యత్తు పై ప్రజలకు, నేతలకు నమ్మకం కలిగించాలంటే ఆ పార్టీ ఈ ఎన్నికలలో తప్పక రాణించాలి.



