వివాదాలకు తెర దించిన ఏపీ సిఎం!

chandrababu naidu vijayawada flyoverవిజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ ‘నామకరణం’ వివాదాస్పదంగా మారింది. వంగవీటి మోహన రంగా అని ఒక వర్గం, చిన పోతయ్య అని మరో వర్గం, వాళ్ళు, వీళ్ళు కాదు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరే పెట్టాలని అధికార పార్టీ వర్గాలు… ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కొత్త కొత్త డిమాండ్లను తెర పైకి తెచ్చారు. దీంతో ఈ ఫ్లై ఓవర్ కు చివరికి ఎవరి పేరును ఖరారు చేస్తారోనన్న ఆసక్తి నగర వాసుల్లో నెలకొంది.

447 కోట్ల అంచనా వ్యయంతో అమ్మ వారి చెంత కొలువు తీరనున్న ఈ ఫ్లై ఓవర్ కు “కనకదుర్గ ఫ్లై ఓవర్” అని నామకరణం చేసారు. శనివారం నాడు జరుపుకున్న శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఓ ప్రకటన చేసారు. విజయవాడ నగరానికి పరిరక్షించే దేవతగా భావించే అమ్మ వారి పేరునే ఖరారు చేయడంతో వివాదాలకు పులిస్టాప్ పెట్టినట్లయ్యింది.

మొత్తం 2.5 కిలోమీటర్లలో నిర్మితం కానున్న ఈ ఫ్లై ఓవర్ ను అయిదు విభాగాలుగా విభజించి ఏక కాలంలో అన్నీ పనులు ఒకేసారి పూర్తయ్యేలా ప్రణాళికలు చేపట్టారు. 2016 ఆగష్టులో కృష్ణా నది పుష్కరాల సమయం నాటికల్లా ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యి, రవాణాకు అందుబాటులోకి తేవాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఈ దిశగానే పనులు చేపట్టిన సోమా సంస్థకు సూచనలు చేసింది.

ADVERTISEMENT
Latest Stories