వ్యక్తిగతం కాదంటూ పార్టీల ప్రస్తావన ఎందుకు రెడ్డిగారూ?

Chandrababu Naidu and Adinarayana Reddy political row

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “టీడీపీలో అందరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ఉంటారు. ఒకవేళ ఎవరైనా హద్దు దాటితే ముందు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతాము. కానీ వినకపోతే చర్యలు తీసుకుంటాం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. మేము ఎంతో కసరత్తు చేసి అన్నీ ఖరారు చేస్తే, పార్టీలో కొందరు రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారు. మాకు కూటమి ఐక్యత ముఖ్యం. కనుక ముందు నచ్చజెప్పాం. కానీ మాట విననివారు ఎన్నికల్లో గెలిచినా పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పాం. దానికే కట్టుబడి ఉన్నాం.

ADVERTISEMENT

పార్టీని నడిపించాలంటే అందరినీ క్రమశిక్షణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వలేదని మా పార్టీలో ముగ్గురు అలిగారు. అలాగే ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా. వారికి నచ్చజెప్తున్నాం. ఒకవేళ మాట వినకపోతే చర్యలు తప్పవు. అది మా పార్టీ అయినా, మిత్రపక్షాలైనా.

అయినా పదవుల కోసం అలగడం ఏమిటి? రాజీనామాలు చేస్తామని బెదిరించడం ఏమిటి? ఇలాంటి అలకలు, బెదిరింపులకు భయపడితే పార్టీని నడిపించలేము” అని అన్నారు.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డికి ఇవ్వాలని, లేకుంటే రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నారు. ఈ పదవి తన కుటుంబ సభ్యులకే దక్కాలని పట్టుబడుతున్నారు.

అయితే, ఇది వ్యక్తిగత విషయం కాదని, టీడీపీ-బీజేపీకి సంబంధించిన విషయమని వాదిస్తూ సీఎం చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఆదినారాయణ రెడ్డి తన రాజీనామాతో ఈ సమస్యను టీడీపీ-బీజేపీ సమస్యగా మార్చాలనుకోవడం, బీజేపీ అధిష్ఠానం తనతోనే ఉందని చెప్పుకోవడం, తమ అధిష్ఠానంతో మాట్లాడుతానని చెప్పడం.. ఇవన్నీ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలుగా భావించవచ్చు.

అయినప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటిస్తూ కేవలం ఆయన ఒక్కరినే ప్రస్తావించకుండా, టీడీపీలో కూడా ఇలా ప్రవర్తించేవారున్నారని ఎవరిని సహించబోనని స్పష్టం చేశారు.

ఇంత చెప్పినా ఒకవేళ ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తే మళ్ళీ కూటమిలోకి రాలేరు. మరి వైసీపీలోకి వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారా? వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చిందా? రాజీనామా చేస్తే ఆయనే అసలు విషయం బయట పెడతారు.

ADVERTISEMENT
Latest Stories