ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపిలో చేరిన చిన్న శ్రీను తొలిసారిగా తన బంధువు, జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు.
శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, “స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం బొత్స సత్యనారాయణ జీర్ణించుకోలేక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
బీసీల కోసం మొసలి కన్నీళ్ళు కార్చే బదులు మున్సిపల్ ఎన్నికల్లో వారికి టికెట్స్ ఇవచ్చు కదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యంగా వ్యవహరించింది. ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనం. వైసీపీ తప్పులు చేసి వాటిని ప్రత్యర్ధులపై రుద్దడం బాగా అలవాటు. కనుక ఆ అలవాటు ప్రకారమే ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఇప్పుడు టీడీపీని, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు,” అంటూ చిన్న శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ఇంతకాలం టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ ఉండేది. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణకు రైట్ హ్యాండ్‌గా జిల్లా వైసీపీని, రాజకీయాలను చక్కబెట్టిన చిన్న శ్రీను టీడీపిలో చేరడంతో, జిల్లా వైసీపీపై ఈ ప్రభావం అప్పుడే కనిపించింది.
చిన్న శ్రీను అప్పుడే తన కుమార్తె సిరి సహస్రకు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కేలా చేశారు. ఇప్పుడు నేరుగా విజయనగరంలోనే చిన్న శ్రీను బొత్స సత్యనారాయణపై ఇలా విమర్శలు గుప్పించారు.
తర్వాత జిల్లాలో గ్రామస్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలను టీడీపిలోకి ఆకర్షించేందుకు చిన్న శ్రీను ప్రయత్నాలు మొదలు పెట్టడం ఖాయం. అప్పుడు ఆయనను బొత్స సత్యనారాయణ ఏవిధంగా ఎదుర్కొంటారో?





