డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – నందమూరి నటసింహం కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాపై ట్రేడ్ వర్గాలలో, సినీ ప్రేక్షకులలో భిన్న స్పందనలు ఉన్న విషయం తెలిసిందే. వైరెటీ కాంభినేషన్ కావడంతో, ఈ సినిమా ఎలా వస్తుందో అన్న సందేహం నెలకొన్నప్పటికీ, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… విజయవంతంగా షెడ్యూల్స్ ముగించుకుంటోంది. ప్రస్తుతం పోర్చుగల్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
హీరోయిన్ శ్రేయాతో పాటు ఛార్మి కూడా ఈ సెట్స్ లో సందడి చేయడం విశేషం. ఇక ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ విడుదలకు దర్శకుడు పూరీ జగన్నాథ్ రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ 10వ తేదీన నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా… ఒక రోజు ముందుగా అంటే జూన్ 9వ తేదీన ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో బాలయ్య జన్మదినం కోసం నందమూరి అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
నందమూరి నటసింహం కెరీర్ లో 101వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న దీనికి ఎలాంటి టైటిల్ ను ప్రకటిస్తారు అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది. గతంలో “రెడ్డి గారు” అన్న టైటిల్ హల్చల్ చేయడంతో… ఈ సినిమాలో బాలయ్య ఎవరిని టార్గెట్ చేసారో అన్న టాక్ వినపడింది. అయితే తాజాగా “టపోరి” అన్న టైటిల్ ను ఖరారు చేసారన్న వార్తలు హల్చల్ చేసాయి. టైటిల్ ప్రకటన విషయంలో ఎప్పుడూ ముందే ఉండే పూరీ, ఈ సారి మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్లు వినికిడి.


